వివేకానందుడు తన విద్యార్థి జీవితములో అజ్ఞేయవాది. నాస్తికుడు అని కూడా చెప్పవచ్చు దేవుడు తెలియనివాడైతే అతడు లేడనుకోవటం వైపే మనసు మొగ్గుతుంది గదా! కావుననే," మీరు, మహాశయా! భగవంతుని చూపించగలరా?" అని పెద్దలనెందరినో ప్రశ్నించాడు. కానీ, హతుశుడై తిరిగి వచ్చాడు. తరుణం వచ్చింది. చివరికి నరేంద్రుడు (వివేకానందుని పూర్వ నామం) శ్రీ రామకృష్ణుని స్పర్శ వలన అద్వైతానుభూతి పొందాడు. కాని, అది అప్పటిలో వ్యతిరేక పరిణామునే కల్గించింది. నరేంద్రుడు అదేదో ఇంద్రజాలమనుకుని, 'ఈ మాంత్రికుని పొత్తు పనికిరాదు' అని నిశ్చయంచుకున్నాడు. అయితే ఉక్కు- ముక్క అయిన నరేంద్రుని ఎలా వంచగలిగాడు -పరమహంస- రామకృష్ణుడు?
"శ్రీ రామకృష్ణుని ఆధ్యాత్మిక సామర్ధ్యము గాదు నన్ను వశపరుచుకున్నది, అయన సుతీవ్రరమగు ప్రేమే నన్ను దాసోహమనిపించింది" అని వివేకానందుడు కాలాంతరమున వెల్లడించాడు. ఇక దైవభక్తుడగు శ్రీరామక్రిష్ణునియందే అంతటి ప్రేమే ఉంటే, అ దేవియగు అమ్మయందు ఆ ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోగలము. ఇదిగో ఈ ప్రేమే ఎక్కువగానో తక్కువగానో అమ్మను దర్శించిన వారందరినీ ఆకట్టుకుంటుంది. ఇది ఎంతమంది స్వానుభవమో చెప్పలేము. అందుకే, ఎవరో ప్రశ్నించినప్పుడు " ఇక్కడకు ఒకసారి వచ్చిన వారు మళ్ళీ రావలనుకోవడమే ఇక్కడి విశేషము" అని సమాధానమిచ్చారు. అమ్మ, వారి హృదయ సౌకుమార్యమును బట్టి ఈ ప్రేమశక్తీ బాలబాలికలను, యువతీ యువకులను ఎక్కువ ప్రభావితము చేస్తుంది. ప్రేమలోకమును వారిలో నింపుతుంది. వారికి ప్రేమ మార్గము చూపుతుంది. 'తృప్తిగా పంచి పెట్టుకో' అనేదానికి ఆధారమును ప్రేరణను కలిగించుతుంది. ఉదాహరణకు, 4-11-73 న అమ్మ సాముహిక దర్శనం ప్రసాదించి విడిదికి తిరిగి వస్తున్నారు. ఏలూరులో వాహనముల సమ్మర్ధమువలన కారు నెమ్మదిగా సాగుతుంది. ఒక పిల్లవాడు పరిగెత్తుకొని వచ్చి , కారు ప్రక్కనే ఆగి, అమ్మ ముఖము లోనికి చూచి -"అమ్మా! వెళ్ళిపోతున్నావా?" అని గావురుమన్నాడు. అది దేవతలు వీక్షింపదగిన దృశ్యము. అమ్మ హృదయం ద్రవించింది. విడిదికి వచ్చిన పిమ్మట అమ్మే ఈ సంఘటనను ప్రత్యేకించి పేర్కోన్నారు.
అమ్మ ప్రేమ విధానములో ఒక విలక్షణత ఉంది. విలక్షణమూ విశిష్టమూ అయినప్పటికి, అది మాతృశ్రీగా మాతృశ్రీ ప్రేమకు పరమ సహజము అత్యంతామోఘము. ఆవేధన, అమ్మ స్వాధినమై స్వాధీనము చేసుకుంటుంది. అమ్మ అన్నారు, " వాడి మాట ఏమోగాని, నేను మాత్రం మీకు 'సరెండర్' (స్వాధినమే) నాన్న! తల్లే పిల్లలకు సరెండర్' అవుతుంది నాన్నా....... బిడ్డ తల్లికి 'సరెండర్' అయితే అది చాలా గొప్ప విషయము వాడు తల్లి కన్నా గొప్పవాడిగా చెప్పుకొవచ్చు." అని ముగించారు. అమ్మ యీ పద్ధతి ప్రభుసమ్మితమా, సుహృత సమ్మితమా,కాంతా సమ్మితమా? అది మాతృశ్రీకి అనన్యమైన మాతృసమ్మితముఅంతేగాని పై మూడింటిలో ఏది గాదు.. యువకులు ఒక్కొక్కప్పుడు చాలా ఉద్రిక్తులుగా ఉంటారు. వారిని అప్పుడు బలాత్కరించి వారించలేము. అపుడు అమ్మ ప్రేమ వారిని లొంగ దీసుకుంటుంది.
జీవనమంటే, కేవలము చలనము గాదు. అది ప్రగతిశీలమైన చలనము. ఈ ప్రగతి భావమూ ఆకాంక్ష యువ వయస్సులో మిక్కుటముగా ఉంటాయి. అంతేగాదు, కొన్ని కొన్ని సంధి సమయాల్లో ఈ ప్రగతితత్వం ఉవ్వెత్తుగా ఉప్పొంగుతూ ఉంటుంది. ఇది అన్లాంటి సమయం అని పెద్దలు అసకృత్తుగా వెల్లడించు చున్నారు. అందుచేతనే యువలోకము గతము మీద ప్రగతివిరుద్దమైన సాంప్రదాయము మీద -తిరుగుబాటు చేశారు. తిరుగుబాటైతే చేసారుగాని సరిగా ఏమి చేయాలోఏ మార్గము అనుసరించాలో వారికి అంతుబట్టలేదు. కావుననే వారి తిరుగుబాటు అప్పుడప్పుడూ గమ్యదృష్టి రహితమైన విధ్వంసక మార్గములోనికి మళ్ళుతుంది. కాలేజీలలో విద్యార్థులు ధనసంపాదనాపరమైన జ్ఞానమైతే పొందుతున్నారుగాని, సామరస్యమైన జీవితమును సాగించేందుకు వారికి జీవన ప్రజ్ఞా సమతలు కొరవడినాయి. ఇదే ఆధునిక నాగరికత ఎదుర్కొంటున్న క్లిష్టస్థితి.
అమెరికా మున్నగు దేశాలలోని యువకులు కొందరు -హిప్పి అనేబడేవారు -భౌతిక భొగాలతో విసుగెత్తి, 'ఇది జీవిత పరమార్థము కాదు, మానవుడు తన నిజ స్వరూపము తెలుసుకోవాలి, అపుడే అతడి మనుగడకు సార్థకత." అని ఉద్యమమును ప్రారంభించారు. కానీ , వారు దారి తప్పి, మత్తు కలిగించే కొన్ని కొన్ని ద్రవ్యాలను సేవించి, ఆ విధముగా ఆత్మను కనుగొనాలని చూస్తున్నారు. వారికి తరుణోపాయం?
మంత్రాయీ అను అమాయిక భక్తుని తలను అమ్మ తన గుండెల్లో పొదుపుకొని, చెక్కిళ్ళు సవరించుతూ, "పరిశుద్ద ఆత్మ అంటే ఇదే నాన్నా! అర్థమైందా?" అని నెమ్మదిగా ఆడిగారు.
మంత్రాయి : లేదమ్మా!
అమ్మ : ఇప్పుడు నీకు ఎలాంటి అనుభూతి కలుగుతోంది?
మంత్రాయి : మా అమ్మ దగ్గర ఉన్నట్లు.
అతని అనుభూతిని స్పష్టపరుస్తూ, " నేను మీ అమ్మనని అనిపించిందా లేదా? " అని అమ్మ ఆడిగారు. చెప్పటం చేతగావడం లేదు. ఆ భావమును వ్యక్త పరచలేను" అని ముగ్ద సమాధానము. దీని సారంశము ఏమంటే, నేను అమ్మ బిడ్డను అనిపించినప్పుడు 'నేను' రూపమేదయితే ఉన్నదో,. అదే నా స్వరూపము, అదే పరిశుద్దాత్మ. దాని విజ్ఞానమే జీవిత సాఫల్యము. అట్టి గుహ్య విజ్ఞానమును అమ్మ ప్రసాదించగలరు. కావున, అ హిప్పీలవంటివారు అమ్మను ఆశ్రయించుతే! అమ్మ దగ్గర వారు వారికి కావలసిన వెలుగును పొందగలరు. ఎలాంటి మహోత్తర అవకాశం; తిరుగుబాటు చేసిన యువకులు అనేక ప్రదేశాల్లో సామూహిక జీవనము నందు ప్రయోగాలు జరుపుతున్నారు. కాని, ఆ ప్రయోగాలు సాధారణముగా విఫలమైపోతున్నాయి. ఏలన "ఒకే మూలము నుంచి వచ్చాము, ఒకే తల్లి బిడ్డలము" అనే అనుభవజ్ఞానము వారికి లేదుగా!
అతి బాల్యము నుండి కూడా అనసూయమ్మ నిజానికి అమ్మే. అందుచేతనే మాతృ సహజమగు భావన అమ్మలో పొడమింది. అప్పుడు బాల్యము లోనే అందరిల్లు ఒకటుండి, అందరు ఒకే కుటుంబ సభ్యులుగా జీవించితే ఎంత బాగుండును- అని భావించారు. ఆ భావన యొక్క వాస్తవికరణమే జిల్లేళ్ళమూడి లోని అందరిల్లు, అన్నపూర్ణాలయం చూడండి. చిత్రం! ఇప్పటి యువకుల సాముహిక జీవన ప్రయోగాలకు అప్పటి అమ్మ భావన ఎలాంటి కేంద్ర స్థానమును ఏర్పరించందో! ఈ విషయములోకుడా యువలోకానికి తన సర్వమాతృత్వము ప్రాతిపదికముగా అమ్మ నవా లోకమును చూపుతున్నారు.
నాటినుంచి నేటివరకు ప్రెంచి విప్లవము ప్రపంచానికినిచ్చిన ఆశయాలు. స్వేచ్చ, సమానత్వము భ్రాతృత్వముల కొరకు యువలోకము పోరాడుతూనే ఉన్నది. ఈ పోరాట ఫలితముగానే ప్రపంచము రెండు ప్రధాన కూటములుగా చీలిపోయింది. ప్రజాస్వామ్య దేశాలు కమ్యూనిస్టు దేశాలు. మొదటిది స్వేచ్చకు ప్రాధ్యానము ఇవ్వగా రెండవది సమానత్వానికి ప్రాధాన్యము ఇస్తుంది. అందుచేతనే మేధావులు భీతిల్లే భయానకఘర్షణ ప్రపంచములో ఈ ఘర్షణ కారణముగా ప్రపంచానికి భవిష్యత్తే ఉండదేమో అనే భయము కలుగుతోంది. ఇప్పటి మనః స్థితిలో ఉన్నంతకాలమూ ఈ భయమూ తప్పదు, భవిష్యత్తూ సందేహాస్పదమే.
ఇప్పటి మనఃస్థితిని అధిగమించి గంభీరతరమగు మనఃస్థితిలో అడుగు పెట్టాలి; అప్పుడే మూలమును గుర్తించే అవకాశము చిక్కుతుంది. ఆ మూలములో పరస్పర విరుద్ధముగా భాసించే స్వేచ్చానమతలకు సామరస్యము సిద్దించుతుంది. ఒకే మూలము నుంచి వచ్చాము-అనే ప్రజ్ఞ కూడా లభించుతుంది గాన, సహజముగా మనమందరం సోదరుల మవుతాము. అలా మూడవ ఆశయమగు భ్రాతృత్వము కూడా సిద్ధింస్తుంది. అయితే ఇది అనుకున్నంత సులభమేమీ కాదు. అసలు మానవుడు తనకు తానై మూలమును ఎప్పటికి గుర్తించలేడని కూడా చెప్పవచ్చు.
ఇక్కడే అమ్మ పాత్ర యొక్క అద్వితీయతను మించి కనపడుతుంది. మూలమును గుర్తించాలి - అని వక్కాణించే పెద్దలు అనేకులున్నారు. కాని, మూలము తానై వచ్చిన అమ్మ వంటి వారు యెవరున్నారు.? మూలము తానై వచ్చిన అమ్మ తన హృదయమును తెరచి గుర్తించండి నన్ను - అని పిలువక పిలుస్తున్నారు. "తెలియనిది తెలియచేయడానికి నా యీ రాక" అని అమ్మే స్వయముగా వెల్లడించారు. అందుకు కంకణము కట్టుకొని కూర్చున్నారు. ఎంతటి అపూర్వ సమయము లోకానికి, ముఖ్యముగా స్వేఛ్చా సమతా భ్రాతృత్వాలకు పోరాడే యువలోకానికీ!
ఒక మాట:
యువలోకము కేవలమూ వయస్సు మీద ఆధారపడదు.
18 సంవత్సరాలవాడు చిట్టము గట్టిన ఛాందాసుడుగావచ్చు.
80 సంవత్సరాలవాడు మనస్సును తెరచి నూతనాలోకమును స్వీకరించేవాడు కావచ్చు.
అందుచేత ఏ వయస్సులో ఉన్నా మనమందరం యువకులమై అమ్మ నవ్యజ్యోతిని స్వీకరించెదము గాక!
"తృప్తిగా (ఆదరముగా) పంచి పెట్టుకో" తో ఆరంభించి, మమతను పెంచుకుని, విస్తరింపజేసుకుని, అమ్మ ప్రసాదించే నూతన దీప్తిని ఆశ్రయించి, అమ్మ మనందరకు తల్లి అని గ్రహింతుము గాక! గ్రహించి దివ్య జీవనానికి నాందీ వాక్యమును పలుకుదుము గాక!