ఏ జన్మాంతర సుకృతం వల్లనో మాతృశ్రీ అమ్మ నాకు అన్నపూర్ణాలయం లో సేవకు అవకాశమిచ్చారు.

 

అది అన్నమునకు సంపూర్ణమైన ఆలయం , అయినా; అమ్మ ‘ఆగ్రహిస్తే- అగ్నిగుండము’ ‘అనుగ్రహిస్తే - అమృత భాండము.’

 

ఒక రోజు సాయంకాలము ఏ కారణం చేతనో చికాకు, విసుగు కోపము ఇలాంటి భావాలన్నీ కరుడు గట్టుకొని ఏంచేయాలో తోచక అమ్మ దగ్గరకు వెళ్ళాను. అమ్మ ఏ సి రూములో మంచం మీద కూర్చొని ఉన్నారు. ఆ సమయములో శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు కీ. శే. గరుడాద్రి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. నీలం రంగు బల్బు వెలుగులో నీలం రంగు పట్టు చీర ధరించి ఉన్నారు. అయితే మంచంపై అమ్మ కూర్చొన్న భంగిమ చాలా విచిత్రంగా ఉంది. భావాలు అన్ని మటుమాయమైనాయి. రామచంద్రమూర్తి గారితో నెమ్మదిగా ఇది ఏమిటి? అని ప్రశ్నించాను. మాట్లాడవద్దు అని సంజ్ఞ చేశారు మాస్టారు. ఆగది అంతా నీరవ

 

నిశబ్దము అమ్మ కన్నుల్లో ఇది అని చెప్పరాని అలౌకిక దివ్యకాంతి అమ్మ దేహంలో నుండి అద్భుతమైన కాంతులు తీవ్రమైన భావావేశాన్ని నామరూపాలు లేకుండా చేసికొని సుమారు 3- 4 గంటలు ఆమహాచైతన్య స్రవంతిలో లీనం అయి ఎలాగోలా బయటలోకంలో పడ్డాను.

 

చాల సంవత్సరముల తరువాత అమ్మను అనేక మంది చూసినా వెలుతురులో చూసినా చీకటిలో చూసినా ఏకాంతమోలో చూసినా ఆనాటీ పారవశ్యము అలౌకికతా దివ్యకాంతి, నా మనసు స్తబ్ధము చేసిన స్థితి అంతకు ముందు, ఆతరువాత ఏనాడు జరగలేదు.

 

అమ్మలో కదిలిక ఆరంభమైన తరువాత అమ్మ కాలి బ్రొటనవేలు నా భ్రుమటికి తగిలేటట్లు నమస్కారం చేసుకొని క్రిందికి వచ్చాను.

 

తరువాత మాష్టారు గారిని యీ స్థితి గురించి ప్రస్థావన తెస్తే అమ్మ సమాధ్యవస్థలో నుండి ఆ దివ్యానంద డోలికలలో విహరిస్తున్నదని చెప్పారు. ఆ సమయములో కాలి బ్రొటన వ్రేలిని తాకి నమస్కారము చేయుట సర్వోత్తమము అన్నారు. ఈ నాటికీ ఆ దృశ్యము గుర్తుకు వస్తే దేహము పులకరించినట్లు ఉంటుంది.

 

జయహో మాతా! శ్రీ అనసూయా!! రాజరాజేశ్వరి! శ్రీ పరాత్పరి!!

 

Author: 
కీIIశేII ఐ. హనుమబాబు
Source: 
శ్రీ విశ్వజనని ఆగస్టు 2001 ( సంపుటి 1 సంచిక 1)