వాత్సల్యజలధి అయిన అమ్మనుండి మనము పొందిన వాత్సల్యానికి అవధులు లేవు భౌతికంగా మనకు దూరమైనా మన అవసరాలను కనిపెట్టి ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో దానిని అందజేస్తున్నది.
మనలో ఉండే రాగద్వేషాలు అసలు స్వరూపానికి అడ్డంగా నిలుస్తాయి. రాగద్వేషాలు నశిస్తే మన వ్యక్తిత్వం స్వచ్ఛమైన అద్దంలా మారుతుంది. అపుడు బయట ప్రపంచంలోని దేనికోసమో తాపత్రయం ఉండదు. అట్టి వ్యక్తిత్వాన్ని వికసింపచేయటానికి వాత్యల్యమూర్తి అయిన అమ్మ అవసరమెంతైనా ఉంది. శాశ్వతమైన ఆనందానికి, సత్యానికి స్థూలరూపం అమ్మ. అట్టి అనురాగమూర్తి అయిన అమ్మ వాత్సల్యామృతాన్నిక్రోలిన మనకు ఇతరత్రా కోరవలసినదంటూ ఏమీ ఉండదు.
అమ్మ అనేపదానికి వాత్సల్య అనే పదం పర్యాయ పదమా! అనిపిస్తున్నది. ఆవు తన దూడను దగ్గరకు తీసుకోవడంలో వాత్సల్యముంది. ఆవు యీనినప్పుడు దూడకు అంటిఉన్న మాలిన్యాన్ని స్వయంగా నాకి పరిశుద్ధం చేసేందుకు దగ్గరకు తీసుకొనే స్వభావమే వాత్సల్యం . ఆవుకు మాలిన్యమూ, దోషము కనబడనట్లే,అమ్మకు మనలోని దోషములు కనబడవు. అటువంటి వాత్సల్యముతోనే అమ్మ "మీరు బురద పూసుకువచ్చిన కడగవలసినదాన్ని నేనేగదా!" అని అంటుంది. మనలోని గుణదోషాలను పట్టించుకోక మనలోని మాలిన్యాన్నీ, దోషాలనీ అమ్మ ప్రక్షాళనం చేస్తోంది.
అన్ని బాధలలోకి ఆకలి బాధ గొప్పదనిపిస్తుందంటా అందుకే "నీకు ఇచ్చినది తృప్తిగా అనుభవించటం, నీకు ఉన్నది నలుగురికి ఆదరణంగా పెట్టటం, అంతావాడే చేస్తున్నాడని నమ్మటం ఇదే నా సందేశం" అన్నది.
అమ్మ సందేశాన్ని ఆచరణలో పెట్టటానికి అమ్మ పిల్లలమైన మనమంతా నడుముకట్టాలి. సేవ, ప్రేమ-జ్ఞానం అనే కాగితాని రెండు ప్రక్కలు . తోటివారిని ప్రేమించటం ,ఆదరించటం కన్న మించిన జ్ఞానం లేదు. అమ్మ తన అసాధారణ అపార వాత్సల్యంతో మన అందరినీ తన వైపు త్రిప్పుకొని మన శారీరక మానసిక, ఆర్ధిక అవసరాలను తీరుస్తున్నది. అట్టి అమ్మ వాత్సల్యాంబుధిలో ఓలలాడిన మనం కొంతలో కొంతగా ఆ వాత్సల్యాన్ని తోటివారిమీద చూపగలిగినప్పుడే మన జీవితాలు ధన్యం అవుతాయి. చంద్రునికో నూలుపోగు అన్నట్లుగా అమ్మకు మన కృతజ్ఞతలు చూపగలుతాము.
అఖండ తపోధ్యానాదుల వల్ల భగవంతుడు ప్రత్యక్షమై వెంటనే అంతర్థానమైనట్లు మహాభక్తుల చరిత్రలలో మనకు కన్పిస్తుంటే, ఎట్టి కష్టమూ లేకుండా ఆ భగవంతునిచే లాలించబడటం,పాలింపబడటం మన అదృష్టం. ఆ అదృష్టాన్ని నెమరు వేసుకొంటూ అమ్మ తలపెట్టిన పనులకు చేయుతనిస్తూ ప్రగతి పథంలో పయనిద్దాం.