'ఇది ఏమిటి?' 'అసలు ఇది ఏమిటి?' అనే తార్కిక చింతన సదసద్వివేచన కలిగించి నిజమైన హేతువాదిగా, కమ్యునిష్టుగా, సత్యాన్వేషిగా అచ్చమైన విచికిత్సను రేకెత్తించి అనేక ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు, రుగ్మతలకు ఔషధాన్ని దయతో అనుగ్రహించిన జగద్గురువుగా, భిషగ్వరేశ్వరిగా అమ్మ అందరికి సుపరిచితమే.

 

అదేవిధంగా శారీరక రుగ్మతలకు కూడా సరియైన వైద్య విధానాన్ని అమ్మ అనుగ్రహించింది. సోదరులు శ్రీ వీరమాచనేని ప్రసాదరావు గారి కోడలు కారు ప్రమాదంలో శిరస్సు ఛిన్నాభిన్నం కావటం, వైద్యుల అంచనాలు తారుమారుగా పూర్తి స్వస్థత చేకూరటం మనందరికీ తెలిసిందే. ఆశ్చర్యమేమంటే 'అమ్మ స్వయంగా సర్జన్ రూపంలో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళటం నేను చూసాను' అని ప్రసాదరావు గారు ఇచ్చిన సాక్ష్యం.

 

కాగా, నేనూ ఒక డాక్టర్ నే. ఎందరికో వైద్యం చేశాను. సాహసంతో అమ్మకి వైద్యం చేశాను. ఎన్నో అసంభవాల్ని సంభవం చేసింది అమ్మ. ఈ నేపథ్యంలో నా అనుభవాల్ని తోడబుట్టిన వారితో పంచుకోవాలని ఉంది

 

1) మాతృశ్రీ మెడికల్ సెంటర్ లో నేను మొదటి ప్రసూతి వైద్యం 'అనసూయ' అనే అమ్మాయికి చేపట్టాను.మూలానికి వెడితే ఆ అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మకి మన అనసూయమ్మే స్వయంగా పురుడు పోసిందంట. ఆ విషయం తెలిసి జాగ్రత్త పడి సలహా కోసం నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఒక సీనియర్ మోస్ట్ గైనకాలజీ శైలిలో అమ్మ , "తల ఏ పొజిషన్ లో ఉంది?" అంటూ అన్ని వివరాలు అడిగి 'నార్మల్ అవుతుంది, పో!' అని హామీ ఇచ్చింది. నేను తిరిగి యం యం సి రాగానే అమ్మ మాట ఎప్పటిలాగానే సత్యం అయింది. ఇదే బాణిలో కొమరవేలు శేషు, మతుకుమల్లి శారద... ఎందరి సందర్భాల్లోనూ జరిగింది. సైద్దాంతికంగా మా ప్రొఫెసర్లు బోధించిన పాఠాల్ని అమ్మ ఆచరణాత్మకంగా చూపింది

 

2) సాధారణంగా నాడి ఒక నిమిష కాలం గణనం చేయాలి కానీ, మాబోటి జూనియర్ డాక్టర్లు అరనిమిషం చూసి రెట్టింపు చేసుకో అని దగ్గర దారి చూపిస్తారు. కానీ, ఆ విధానం దోష భూయిష్టం అని అమ్మ సన్నిధి తేల్చి చెప్పింది. 'అమ్మ' మనకంటే వెలుగు దైవం కదా! కావున అమ్మకి పల్స్ చూసేటప్పుడు జాగ్రత్తగా ఒక నిమిషం చేసేదాన్ని. గర్భకోశ సమస్యతో ఒక రోగి వచ్చింది. అలవాటు ప్రకారం ఒక నిమిషం చూసాను. మిస్సింగ్ బీట్స్ ఉన్నాయి . గుండె జబ్బు ఉన్నట్లు చెప్పాను. వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయుంచుకొంది. లోగడ ఆ అమాయికి రెండు కాన్పులయిన ఎవరూ ఈ గుండె జబ్బును ఎరుకపరచలేదు. 'నా బిడ్డనూ బ్రతికించావంటూ’ ఆనందభాష్పాలు రాల్చింది ఆ సోదరి తల్లి. ఇది అమ్మ అనుగ్రహం కదా! అమ్మ చేతిలో నేను ఒక సాధనం మాత్రమే.

 

3) అనారోగ్యకారణంగా అమ్మ నెల్లూరు లో డా. ఎస్వీ సుబ్బారావు గారింట్లో ఉన్న రోజులవి. ఒక రోగి విపరీతమైన ఆయాసంతో వచ్చాడు. వెంటనే కాకతాళియంగా నాడి రక్తపోటు చూసి గుండె వైఫల్యంకి వాడే మందులు యిచ్చాను. డా. సుబ్బారావు గారు ఆస్పత్రికి ఇంకా రాలేదు. అరగంటలో ఆ రోగి కోలుకున్నాడు. ఇంటికి వచ్చి ఈ వృత్తాంతాన్ని అమ్మకి వినిపించాను. వెంటనే అమ్మ అన్నపూర్ణ అక్కయ్యను పిలిచి, మీ ఆయన వద్దన్నా కేస్ మా ఆవిడ చేసింది చూశావా? అన్నది మందహాసం చేస్తూ. తర్వాత డాక్టర్ గారు ఆ రోగం లక్షణాల్ని వివరించారు. -అది లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్, అది గుండె పోటు కంటే ప్రమాదకరము,రెండు సార్లు కంటే ఎక్కువ రాకూడదు అని. తర్వాత కాలంలో బాపట్లలో అటువంటి ప్రాణాంతక రోగగ్రస్తుల్ని ఎందరినో రక్షించాను. హృదయ విదారక విషయం ఏమంటే అదే స్థితిలో ఉన్న అమ్మను రక్షించలేకపోయాను.

 

4) అన్నపూర్ణాలయం రథ సారథి శేషయ్య గారి మనవడికి క్రానిక్ డమేరియతో ఏడాదిపాటు వైద్యుల చుట్టూ తిరిగారు. చివరికి జిల్లెళ్ళమూడి వచ్చారు. ఆ రోజులలో స్కానింగ్ సౌకర్యాలు లేవు. ప్రయోగశాల పరీక్షలే నిర్వహించి పొత్తికడుపుకు సంబంధించిన క్షయ వ్యాధి (అబ్డామినల్ టి బి) అని నిర్దారించి, నివారణకు మందులు వాడాను. నెల రోజుల్లోనే అద్భుతంగా కోలుకున్నాడు.

 

అలాగే మల్లు అన్నయ్య కుమారుడు తీవ్ర అతిసారవ్యాధికి లోనై నాడు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపిద్దామని సలహా కోసం అమ్మ వద్దకు వెళ్ళాను. మల్లు అన్నయ్య అక్కడే కూర్చుని ఉన్నాడు. నేను చెప్పిన దంతా విని అమ్మ "ఆయుర్దాయం ఉంటే ఎక్కడైనా బ్రతుకుతాడు కదా! నాన్నా!" అంటూ అటు తిరిగి పడుకుంది. అమ్మ ఆ విధంగా నిర్లిప్తంగా మాట్లాడితే తప్పనిసరిగా నయమౌతుందని నా పూర్వానుభవం, ఒక బండగుర్తు. అదే నిజమైంది. రోగం కూడా అనూహ్యంగా మలుపు తిరిగింది. నేను తిరిగి మెడికల్ సెంటర్ చేరుకునేసరికి వాడు హాయిగా ఆడుకుంటున్నాడు. ఈ అద్భుతాలన్నీ అమ్మ నడయాడిన పావన అవని దివ్య ప్రభావ సంభవాలు. నా ప్రజ్ఞ ఏమి లేదు.

 

5) 1981 అక్టోబర్ నెలలో సోదరులు గరుడాద్రి సుబ్రహ్మణ్యం పెదనాన్నగారు దీర్ఘకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. వారిని అమ్మ తన వద్దకు పిలిపించుకున్నది. ఎం ఎం సి లో నా పర్యవేక్షణలో చేర్చింది. ఆ నెల 6 వ తేదిన చక్కగా కూర్చుని మాట్లాడుతున్నాడు. కనుకనే గాభరా పడ్డాను. 7 వ తేది ఉదయం అమ్మ ఎం ఎం సి కి వస్తుందని రామకృష్ణ అన్నయ్య కబురు పంపాడు. రేపు ఉదయం వరకు వారిని ప్రాణాలతో ఉంచి అమ్మ కు చూపించగలనా? అని భయపడ్డాను. 7 వ తేది ఉదయం అమ్మ రానే వచ్చింది. పల్స్,పొట్ట .. అన్నీ చూసి కాసేపు వెక్కి వెక్కి ఏడ్చి వెళ్ళిపోయింది. వెంటనే నెల్లూరు డాక్టర్ గారిని పిలిపించింది. అమ్మకి అన్నీ తెలుసు. కాసేపు ఏడ్చి వెళ్ళిపోయింది. నా పరిస్థితే ఆగమ్యగోచరం. ఆయనికి ఏమౌతుందో, ఏమౌతారో నని టెన్షన్ "వారిని ఇక్కడ ఉంచారు. వారికి చాలామంది బంధువులు బలగం. అనుకోనిది ఏమైనా జరిగితే యెంత గొడవ?” అని ఆవరణలో వాళ్ళంతా నన్ను హెచ్చరించారు.

 

'భగవంతుడా! ఇదేమిటి? ఎలాంటి సౌకర్యాలు లేని చోట వీరిని తెచ్చి నా దగ్గర ఉంచావు.' అని హడలి పోయేదాన్ని. ఆశ్చర్యం! రెండు రోజుల తరువాత నెమ్మదిగా కోలుకున్నాడు. ఇంతకీ అసలు విషయం -- "ఎంతోమంది బంధువులు,బలగం ఉన్నా ప్రేమగా చూసేవాళ్ళెవరూ లేరట. అందుకని పిలిపించానమ్మా!" అని అమ్మ నాకు సంజాయిషీ ఇచ్చుకున్నట్లు చెప్తుంటే చాల సిగ్గేసింది.

 

అమ్మ కు నేను చేసిన వైద్యం

 

1) అమ్మ ఒక వైద్యుడు. త్రికాలదర్శి, ఒక రోగి కూడా, అమ్మ ఓర్పు అనన్యసామాన్యం . ఆ సత్యం అమ్మ చరిత్రలోనే స్పష్టమౌవుతుంది. అమ్మను ఒక రోగిగా చూసిన సన్నివేశాల్ని వివరిస్తాను. అమ్మ తుంటిమీద పెద్ద గడ్డ లేచింది. అసలు ఎలా కూర్చునేదో, ఎలా దర్శనం ఇచ్చేదో ఆశ్చర్యం. మా డాక్టర్ల దగ్గర మూలిగేది. మేము ప్రక్కకు తప్పుకోగానే స్నానం చేసి దర్శనం ఇచ్చేది. బయట వారికి క్షీర సాగరములో ప్రభవించిన లక్ష్మీ దేవిలా, మానససరోవరపుటంచున ఉదయించే బాలభానునిలా ప్రకాశించేది. అంతఃపూర్వం అంత బాధతో విలవిలలాడినది 'ఈ తల్లేనా!' అని ఆశ్చర్యపోవటం మా వంతు, మా అమాయకత్వాన్ని చూసి ముసిముసి నవ్వులుచిందించటం అమ్మవంతు అయ్యేది.

 

ఆ సందర్భంలోనే నెల్లూరు డాక్టర్ గారితో అమ్మ 'గడ్డ కూడా ఒక బిడ్డే కదా! నాన్నా! ఆనటం అలౌకిక శక్తి సంపన్న అమ్మకే సాధ్యం. నిజమే తానూ మనుషులకే కాదు, జంతువులు, క్రిమికీటకాదులు కూ తల్లినని వివరించిననది. అంటే భయంకర రోగకారక సూక్ష్మ జీవులకూ తానూ తల్లేనా? అసలు విషయం, ఆ సందర్భంగా అమ్మ గదిలోనే ఆ గడ్డకి ఆపరేషన్ చేయాలి. తగినంత గదిలో కాంతి లేదు. టార్చి లైట్ ఉపయోగించాము. మత్తు మందు ఇవ్వలేదు. తగిన పరికరాలు లేవు. ఒక బ్లేడును ఉడకబెట్టి కురుపును కోసి పిండి కట్టు కట్టాం . ఇంత అయ్యాక, కూర్చిలో తనను క్రిందికి తీసికెళ్తామంటే అలా చూసినవారంతా బాధపడతారని, తానే బాధను ఓర్చుకొని 32 మెట్లు దిగి వచ్చింది. అమ్మ సహనానికి హద్దులు లేవు.

 

2) అమ్మకి ఊపిరితిత్తులలో కురుపు లేచింది. ముందుగా లంగ్ కాన్సర్ ఏమోనని అనుమానపడ్డం. ఎక్స్-రే తీస్తే మా అనుమానం నిజమయింది. అమెరికా తీసి కెళ్ళి వైద్యం చేయించాలి.? అని తలలు చేత్తో పట్టుకొని మాధనపడుతున్నాం. మా దీనావస్థను చూసి ' నాకు అలాంటిది ఏమి లేదు. కావాలంటే మళ్ళీ పరీక్ష చేసుకోండి' అన్నది. మళ్ళీ పరీక్ష చేశారు. అమ్మ మా కళ్ళకి మాయతెరలు కప్పింది. అమ్మ మాటే నెగ్గింది. అది ‘లంగ్ అబ్సేస్’ అని సమాధానపడి స్థిమితపడ్డాం. బిడ్డల దుఃఖనివారణ కోసం అమ్మ ఎంతటి త్యాగానికి సిద్ధమౌతుందో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. హైదరాబాద్ లో చికిత్స ప్రారంభమైంది. ఫ్లమ్ రూపంతో చీము నెత్తురూ వగైరా అంతా బయటకి రావాల్సిందే. అందుకు మరొక చికిత్స లేదు అని అన్నారు వైద్యులు. నన్ను తగ్గించటానికి తీసుకువచ్చారా? లేదా దగ్గించటానికి తీసుకుని వచ్చారా? అని అమ్మ చమత్కరించినది. దగ్గే సమయంలో ఆ కఫాన్ని ఊయటానికి ఒక పళ్ళెం పట్టుకొని ప్రక్కన నిలబడేవాళ్ళం. ఆ పళ్ళెం పట్టుకోవాలంటే గుండె దడదడలాడేది. చేతులు వణికేవి. ఆ డ్యూటీ నా వల్లకాదు. ఇంకెవరన్నా చేస్తే బాగుండును అనిపించేది. అంటే ఆ స్థితి యెంత దుర్భరమో మీరు ఊహించవచ్చు.

 

3) ది.18.10.1975 వ తేదిన నెల్లూరు లో ఒక రోగికి హార్ట్ ఫెయిల్యూర్ కు చికిత్స చేసి ప్రాణం పోసిన ఉదంతాన్ని ఇందాక మనవి చేశాను. అలా రెండు సార్లు కంటే ఎక్కువ రాకూడదు అని డా. సుబ్బారావు గారు చేసిన హెచ్చరిక నాకు మరుపు వచ్చింది. నా దురదృష్టం మీరు నమ్మండి. ఈ వ్యాసం వ్రాసేవరకు ఆ విషయం గుర్తు లేదు.

 

అమ్మకు మొదటిసారి 1981 లో సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ సమయంలో విపరీతంగా ఆయాసం వస్తే నేను మరియు డా. జస్వంత్ కలసి హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ ఇచ్చాము. మరల రెండవ సారి 1985 లో వచ్చింది. మూడవసారి జూన్ 12 న వచ్చింది. లాసిక్స్ ఇచ్చే సమయం లేదు. ఇస్తుండగానే అమ్మ మనల్ని వదలి వెళ్ళిపోయింది. ఆ ఘోరం నా కళ్ళ ముందే జరిగిపోయింది. ఆ వేదన ఆ లోటు ఊపిరి ఉన్నంత కాలం నన్ను బాధిస్తాయి. అది అమ్మ అమోఘ సంకల్పబలమో, నా బలహీనతో తెలియదు.

 

అమ్మ గురువులకు గురువు; జగద్గురువు.

 

వైద్యులకు వైద్యుడు; భిషగ్వరేశ్వరి.

 

"జయహో మాతా! శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి."

 

Author: 
డాక్టర్. ఎ. ఇనజకుమారి
Source: 
‘అమ్మ తత్త్వచింతన మహస్సు’ విశేష సంచిక సంచిక - నవంబర్ 2011