అమ్మ రామకృష్ణ పరమహంస వివేకానందస్వామికి భగవంతుడ్ని చుపించారుట కదా   " మీరు నాకు చూపించకూడదు? అని ఒక సోదరుడు అమ్మను అడిగాడుట. దానికి అమ్మ సమాధాన మేమిటో గమనించారా! "కనబడేదంతా వాడే అయినపుడు దేనినని ప్రత్యేకంగా వేలు పెట్టి చూపించమంటావు - నాన్నా!  "  ఇదీ అమ్మ సమాధానం.భగవత్ సాక్షాత్కారం కోరిన భక్తుడికి, సత్య దర్శనం కోసం తపించే అన్వేషికి ఇంతకన్నా కావాల్సిన సమాధానం మరేమీ ఉంటుంది? అమ్మ ఇచ్చిన ఈ సమాధానం లో ఎంతో సౌలభ్యం ఉంది. కనబడేదంతా దైవమే అన్నది.

 

మీకు చీమ కనిపిస్తున్నది. దోమ కనిపిస్తున్నది. బల్లా, కుర్చీ కనిపిస్తున్నాయి. వాటిలో దైవం ఉంది, దానికోసం వెతుక్కోండి - అని మనను ఇబ్బంది పెట్టటం లేదు అమ్మ . అరటిపండు చేతికి ఇచ్చి, వలుచుకుని తినమనలేదు. అరిటిపండు తనే వలిచి , మన చేతిలో పెట్టి తినమన్నది. చీమ లో ,దోమ లో కాదు. బల్లలో కాదు ; చీమ నే , దోమనే, బల్లనే , కుర్చీనే దైవం గా చుడమన్నది. ఇది చాలా సులభం కదా! ఒక సోదరి - "మేరు నాలో దైవాన్ని చుస్తారమ్మా!" అని అంటే "మీలో కాదు - మీరుగా చూస్తాను" అని సవరణ చేసింది అమ్మ.

 

"మీరంతా నేనే, మీదంతా నేనే"  అని వివరించింది అమ్మ. ఈ సర్వమూ "నేను నేనైన నేను" అంటూ సర్వాత్మభావం ప్రకటించింది అమ్మ.

 

ఇంతవరకు ఏ ఆచర్యలూ, ఏ ప్రవక్తా, ఇంత తేటతెల్లంగా చెప్పలేదేమో! దైవాన్ని ఇలా అంతటా చూడమని సుచించలేదేమో! అందుకనే సోదరులు డాక్టర్ శ్రీపాద ఇది అమ్మ సూచించే కొత్త దారి అన్నారు .  

 

అవును - దైవమంటే ఏమిటో అమ్మ కోత్తపద్ధతిలో చెప్పింది. సంప్రదాయ వేదాంతులు "తత్సత్" అన్నారు. సత్యమూ, నిత్యమూ, అయిన పదార్థం ఇది కాదు; మన కళ్ళముందు కన్పించే చీమ,దోమ , బల్లా, కుర్చీ అనిత్యం, కాబట్టి ఇదంతా సత్యం కాదు అన్నారు. కాని అమ్మ బల్లా, కుర్చీ,చీమ,దోమ అనిత్యం కాదు, నిత్యమే అంటుంది. రూపాంతరమే కాని, రూపనాసనం లేదు అంటుంది అమ్మ.

 

బల్ల విరిగిపోతే కుర్చీ చేయవచ్చు, కుర్చీ ను చెడగొట్టి బల్లా చేయవచ్చు. ఇది రూపాంతరమే కాని, రూపనాసనం కాదు కదా! చీమా ,దోమా చనిపోతే పంచాబుతల్లో కలిసిపోతాయి కానీ నాశనం కావు. అందుకే అమ్మ మరణమంటే పరిణామం" అన్నది.

అమ్మ చెప్పే ఈ సత్యం శాస్త్రబద్ధం విశ్వజనీనం .

 

విజ్ఞాన శాస్త్రం లోని శక్తీ  నిత్యత్వ సిద్ధాంతం - శక్తిని సృష్టించలేమూ, నాశనమూ చేయలేము. కాని ఒక  రూపం లో ఉన్న శక్తిని మరొక రూపం లోకి మార్చవచ్చును అని చెప్తుంది. స్విచ్ వేస్తే విద్యుద్ధీపం వెలిగి, కాంతి నిస్తుంది. అంతమాత్రాన కాంతిని సృష్టించామని కాదు. విద్యుచ్చక్తి , కాంతిశక్తిగా మారింది. అలాగే డైనమో లో  యాంత్రి శక్తి విద్యుచ్చక్తి  గా మారితే , మోటారులో విద్యుచ్చక్తి యాంత్రిక శక్తి గా మారుతున్నది . ఇలా ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకుంటూ పోవచ్చు.

 

ఈ నిత్యత్వ సిద్ధాంతం శక్తి కే కాదు; పదార్థానికి వర్తిస్తుంది. ఆ మాటకు వస్తే పదార్థమా - శక్తీ వేరు కాదు. ప్రఖ్యాత శాస్త్రవేత ఐంస్టీన్ ప్రవచించిన ద్రవ్య , శక్తి తుల్యతతా నియమం ప్రకారం పదార్థము శక్తీ ఒకటే!

 

ఆటంబాంబు  హైడ్రోజన్ బాంబు లలో పదార్థం శక్తీ గా  మారీ విడుదలవుతుంది,విశ్వ కిరణాల జల్లు లో  శక్తీ ద్రవ్య కణాలుగా పరిణామమ చెందుతుంది. 

 

కాబట్టి శాస్త్రీయ దృష్టి తో  చూస్తే జగత్తు లోని పదర్థమూ, శక్తీ సర్వము నిత్యమేకాని నశ్వరం కాదు. అమ్మ చెప్పేది అదే! జగత్తు మార్పు చెందుతున్నదే  కాని నాశనం కావటం లేదు . అందుకనే మారుతూ ఉండే ఈ జగత్తే నిత్యమన్నది. గాలి, నీరు, బల్లా, కుర్చీ,నీవు, నేను మొదలైన వివిధ రూపాలు ఈ జగత్తు ఇదే సత్యం నిత్యము సత్యము అయినది ఇదేకని మరొకటి కాదు అన్నది. ఇదంతా అదే! ఎప్పుడైనా అంతా తానే అయిన ఒకటి అన్నది సిసలైన అద్వైతమూర్తి  అమ్మ. ఎప్పుడున్నదైన ఆ ఒకటే, అదే అనటం లో అది ఈ నాటిదికాదు అన్న ధ్వని ఉంది. ఆ భావం లోనే  "సృష్టి అనాది" అన్నది అమ్మ. అంతే కాదు, సృష్టి కి  ఆద్యంతాలు లేవు - అని  చెప్పింది అమ్మ.

 

ఇలా అమ్మ సృష్టిని  గురించి చెప్పిన మాటలకూ, ఆదునిక విజ్ఞాన శాస్త్రం విశ్వ సృష్టి  గురించి వచ్చిన అవగాహనకు ఎంతో అన్వయం కుదురుతుంది.

 

అయితే విశ్వసృష్టికి గురించి చెప్పిన మాటలకూ, ఆధునిక విజ్ఞాన శాస్త్రపు అవగాహన ఏమిటి?

 

మనం నివసిస్తున్న ఈ భూగోళం ఒక గ్రహం. తన చుట్టూ  తాను తిరుగుతూ సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తుంది. ఇట్టి గ్రహాలు ఇంకా 8 ఉన్నాయి. ఇవేకాక 50 ఉపగ్రహాలు ఉన్నయి. గ్రహం చుట్టూ తిరిగే దానిని ఉపగ్రహం

అంటారు. చందమామ ఒక ఉపగ్రహమే. ఇలాగ గ్రహాలు, ఉపగ్రహాలు కాక సూర్యుని చుట్టూ తిరిగే గ్రహశకలాలు కొన్ని వేలు ఉన్నాయి. అంతే కాక తోకచుక్కలు కొన్ని వందలున్నాయి. ఇవ్వన్నీ కలుపు కొని సౌరకుటుంబం.

సూర్యుడు ఒక నక్షత్రం. ఇటువంటి నక్షత్రాలు 10 వేల కోట్లు ఉన్నయి. అది ఒక కుటుంబం. దానిని గాలక్సీ అంటారు. మన గాలక్సీ మిల్కీవే అంటారు. ఇట్లా గాలక్సీలు కొన్ని లక్షలతో కూడినది ఈ మహా విశ్వం.

 

Author: 
రాచర్ల లక్ష్మి నారాయణ
Source: 
శ్రీ నాగేశ్వర మహా విభూతి (శ్రీ నవ నాగ నాగేశ్వర ఆలయ ప్రతిష్టా మహోత్సవ ప్రత్యేక సంచిక)