ఒకసారి నెల్లూరు కాబోలు ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను. కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఎవరో యిష్టాగోష్థిగా మాట్లాడుతూ "అమ్మను" గూర్చి మీరేమంటారు? అని ప్రశ్నించారు. నేను సమాధానంగా చిరునవ్వు నవ్వి వూరుకున్నాను.

 

నేను నిజంగా ఆరోజు చేసిన పనికి పశ్చాత్తాపం చెందాను. ఆంధ్రదేశంలో, అందులో గుంటూరు జిల్లాలో వుంటూ అమ్మను గూర్చి తెలుసుకోలేక పోవటం యేమిటి? దేశం నలుమూలల నుంచీ అశేష ప్రజానీకం వచ్చి దర్శనం చేసుకొని మనశ్శాంతిని పొంది, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తుంటే ఆ విషయం గూర్చి నేను ఆలోచించ లేకపోవటమేమి?

 

కానీ, ఒక్కటి మాత్రం నిజం. నేను చాలాసార్లు అమ్మ దర్శనార్థం జిల్లెళ్లమూడి వెళ్ళుదామనుకొన్నాను. ఎందుకో వెళ్ళడం కుదరలేదు. మనస్సు మాత్రం సమయం చిక్కినప్పుడల్లా అమ్మను గూర్చి ఆలోచిస్తూనే వున్నది. ఎలాగయితేనేమి చివరికి ఒకరోజు తలవని తలంపుగా మావూరి మేజిస్ట్రేటుగారితో బాటు నేను అమ్మ దగ్గరకు    బయల్దేరి వెళ్ళాను. దారిలో ఎన్నో ప్రశ్నలు అమ్మని అడుగుదామని అనుకొన్నాను. ఆమెలోని ప్రత్యేకత ఏమిటి? మహాపండితులకు కూడా అర్థం కాని వేదాంత విషయాలు కూడ ఆమె చెబుతుందట! ఎట్లా? ఉద్యోగులూ,నిరుద్యోగులూ ధనవంతులూ బీదవారు ఎందుకు ఆకర్షింపబడుతున్నారు? యిట్లా ఆలోచిస్తూ ఉండగానే  జిల్లెళ్లమూడి చేరాం. ఆ 'వాతావరణం' ఆ 'ప్రశాంతత' నాకు ప్రాచిన కాలం నాటి ఆశ్రమాలను గుర్తుకు తెచ్చినాయి.

 

అక్కడ అందరి ముఖాల్లోనూ ఏదో ఆనందం, తృప్తి, ఉత్సాహం కనబడినాయి. అమ్మ ఎక్కడ ఉంది ? ఏం చేస్తుంటుంది? ఎలామాట్లాడుతుంది? అని ఆమెకై  ఎదురుచూస్తున్నా! ఇంతలో అమ్మ రానే వచ్చింది. ఏమిటో అప్పటిదాకా ఆమెను గూర్చి అనుకున్నదంతా మాయమయింది. అడుగుదామనుకొన్న ప్రశ్నలు మరచిపోయాను. అమ్మ నన్ను పిలిచి పలుకరించి " నీ గురించి అంతా నాకు తెలుసు. అప్పుడప్పుడు వచ్చి పోతూవుండు." అంది. నా మెడ మీద చెయ్యి వేసి.  నేను కొంచెం పొడుగు. అమ్మ కు ఇబ్బంది కలుగుతుందని కొంచెం వంగి నిలుచున్నాను. అంతే నేను వంగి పోయినాను. నేను ఆమె అద్భుత మాతృశక్తికి తలవంచాను     అనుమానాలు పటాపంచలయినాయి. సందేహాలు నివృత్తి అయినాయి. అమ్మ లోని ఆకర్షణ శక్తీ అద్భుతం.

 

ఆతరువాత అమ్మను గురించి రకరకాలుగా ఆలోచించాను. అనేక మందిని ప్రశ్నించాను. ఆమెను గూర్చిన సాహిత్యం చదివాను. కానీ నిజం, ఆమెను గురించి నాకేమి తెలియదు.

 

అనిర్వచనీయమైన ఆత్మానందం అనుభవించానే కానీ,  చెప్పటం ఎట్లా?...

 

నాస్తికత, అకర్మణ్యత  పెరిగిపోతున్న ఈ అణుయుగంలో , ఆస్తికులను సరియగు ఆ స్తికులుగ,  నాస్తికులనుగూడా ఆస్తికులుగ మారుస్తూ, దేవత్వంతో నిండిన మాతృత్వంతో మన శరీరా న్నీ, మనస్సును బుద్ధిని  పునీతం చేస్తున్న మనకాలం నాటి ఈ ‘అవతారమూర్తి’ ని గురించి చెప్పటమే కానీ,  వ్రాయటం కానీ  -నా వల్ల కాదు.

 

Author: 
శ్రీ ప్రభాకర శ్రీ కృష్ణ భగవాన్ MA(కులపతి, సంస్కృత కళాశాల, పొన్నూరు)
Source: 
మాతృశ్రీ మాసపత్రిక సంపుటి 1 సంచిక 4 | సెప్టెంబర్ - 1966