అది 1976 లో జరిగిన సంఘటన. శ్రీ కాళ హస్తి వాస్తవ్యులు కె. గోపీనాథ్ కు సుమారు 60 సంII పై బడి ఉంటుంది. కొన్ని రాత్రులు చెప్పలేని భయంతో నిద్ర లేక బాధ పడుతున్నారు. ఇంటిలో లైటు ఆర్పి వేస్తే భయం. ఒంటరిగా ఉండలేరు. అందరు నిద్ర పోతుంటే అతను మాత్రం మేలుకొనే ఉంటారు . దినదినానికి అతనికి ఆరోగ్యము క్షీణిస్తున్నది. అందరికి బాధగా ఉన్నది. డాక్టర్ కు చూపించి మందులిప్పించుదామన్నా, నయం కాని జబ్బు అది. ఆ గోపీనాథ్ గారు మా మామ గారు కావటం చేత "అమ్మ" దర్శనం చేయిద్దామని నాకు తోచింది. ఆరోగ్య క్షీణతకు అతనిని పలు ప్రశ్నలు వేసినాను. అతనికి ఎదురింటిలో వుండు పంచాక్షరం అను అతనితో స్నేహముంది. ఆ పంచాక్షరం అతని కంటి ముందరే హఠాత్తుగా మరణించినాడట. అప్పటినుంచి అతనికి రాత్రులలో నిద్రలేకపోవడం, గుండెను ఒత్తినట్లుగా వుండటం, ఉచ్చ్వాస నిశ్వాసాలు ఆడడం కష్టమైందని నాతో చెప్పాడు. ఆ విషయం నాకు అర్థం కాలేదు. కొంతమంది చెడుగాలి వలన కలిగిన పరిణామం అని కూడా అన్నారు.
అతనిని తీసుకొనివెళ్ళి "అమ్మ" దర్సనం చేయించాను. అతనుకూడా తన జీవితంలోని విషయములను అమ్మతో చేర్చించినారు. అమ్మ అతనిని రాత్రి జిల్లెళ్ళమూడి లో నిద్రచేయమన్నారు. నేను అతని ప్రక్కనే పడుకున్నాను. అతను. ఆ రాత్రి తృప్తిగా నిద్ర పోయాడు.
అమ్మ ఆశీర్వాదం, ప్రసాదం రెండు పుచ్చుకొని , గోపీనాథ్ గారు శ్రీ కాళహస్తి కి బయలుదేరినారు. అమ్మ అనుగ్రహం వలన ఇప్పటివరకు ఆరోగ్యంగా సుఖనిద్ర అనుభవిస్తున్నారు. అమ్మ విషయం అనుకున్నప్పుడెల్ల, అతనికి కండ్ల వెంబడి నీళ్ళు వస్తాయి. రాజరాజేశ్వరి అయిన అమ్మ ఈ విధంగా ఎంతమందికి మహోపకారం చేస్తున్నారో?.