పూవులు ఎన్నో పూస్తాయి. కానీ, భగవతి శ్రీచరణాలను అలంకరించినవే చరితార్థతను, సార్థకతను సంతరించుకుంటాయి. శ్రీ లక్ష్మీ నారాయణ అన్నయ్య మాతృశ్రీ చరణ సమలంకృత పూజాపుష్పం.
అన్నయ్యను తలుచుకొంటే ఎన్నో వాస్తవాలు కళ్ళముందు నిలుస్తాయి. కలం ఎన్నో రీతుల పరిగెడుతుంది. 'శ్రీలక్ష్మీనారాయణ' అందామా అంటే 'శ్రీ' అంటే ' లక్ష్మీ ' అని అర్థం.
'మా లక్ష్మీనారాయణ' అందామా అంటే 'మా' అన్నా ' లక్ష్మీ ' అని అర్థం.
నిజానికి అన్నయ్య --లక్షనారాయణ, లక్షణనారాయణ లక్షలనారాయణ , కమలానారాయణ.. వివరిస్తా.....
అమ్మ దివ్యసన్నిధిలో ప్రప్రధమంగా శ్రీ లలితాకోటి నామ పారాయణ దీక్షాదక్షుడు కావున- ‘లక్ష నారాయణ.’ నేడు జిల్లేళ్ళమూడి ఆలయాల్లో శ్రీ లలితా లక్ష నామపారాయణ ప్రతి సోమ, శుక్ర వారాల్లో నిర్వహిస్తున్నారు.
మాతృసేవా తత్పరతతో లక్షల విరాళాన్ని ఇచ్చి అమ్మ సంకల్పానికి ఆచరణ రూపంగా నిలిచాడు. కావున- ‘లక్షల నారాయణ.’
హైమాలయంలో, శ్రీ అనసూయేశ్వరాలయంలో నిరాహారంగా ఎన్నో దీక్షలను క్రమశిక్షణతో చేపట్టాడు. జగదేకైక శాసని అమ్మను ఉపాసించాడు. అమ్మను రాజరాజేశ్వరిగా దర్శించాడు. అలా శుభలక్షణ సంశోభితుడు కావున- ‘లక్షణనారాయణ’
కమలక్కయ్య పతిదేవుడు కావున- ‘కమలా నారాయణ’ "కమలా' అన్నా- ' లక్ష్మీ ' అనే అర్థం.
‘లక్ష్మీ! పద్మాలయా, పద్మా కమలా! శ్రీహరిప్రియా!
ఇందిరా లోకమాత మా రమా మంగళ దేవతా!
భార్గవీ లోకజనని క్షీర సాగర కన్యకా'- అనేవి లక్ష్మీదేవి పేర్లని అమరకోశం స్పష్టం చేస్తుంది. శ్రీ శంకర భగవత్పాదులవారు దేవ్య పరాధక్షమాపణస్తోత్రంలో - 'నవాదత్తం దేవి! ద్రవిణమపి భూయ స్తవ మయా! (అమ్మా! జగన్మాతా! కష్టార్జితమైన ధనాన్నైనా నేను నీకు సమర్పించలేదు) –అన్నారు.
ఆ పరమార్థాన్ని చక్కగా తెలుసుకున్న అన్నయ్య - ఇంట్లో దొంగలు పడి సంపదనందంతా దోచుకుపోయిన క్లిష్టపరిస్థితిలో యీష ణ్మాత్రమూ చలించక అమ్మకు నిలువు దోపిడీ సమర్పించాడు.
క్షుత్పి పాసామలాం జ్యేష్టామలక్ష్మీ నాశయామ్యహమ్
"అభూతి మసమృద్ధించ సర్వాన్నిర్ణుదమే గృహత్" - అని శ్రీసూక్తంలో చెప్పబడింది.
అమ్మ సేవకు సమర్పించబడిన ధనం ఇచ్చే ఫలం -ఆకలిదప్పులు , దారిద్ర్యం అవిద్య, అజ్ఞానం , లోటు, లోపం -వారి గృహంలో ఉండనే ఉండవు. కనుకనే లక్ష్మీనారాయణ అన్నయ్య సార్థకనామధేయుడు.
అన్నయ్యను తలచుకుంటే-
జిహ్వేకీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం
పాణిద్వంద్వ సమార్చయ అచ్యుత కధాః శ్రోతద్వయ త్వంశృణు!
కృష్ణం లోకాయ లోచన ద్వయం హరే గచ్చాంఘ్రియుగ్మాలయం
జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్థ న్నమాధోక్షజమ్!!-
అనే ఒక భాగవతుని ఆదర్శలక్షణ సంపద గుర్తుకు వస్తుంది.
"గోపీ భర్తృహ పదాకమలయోహ దాసదాసాను దాసః" అనే దాస భక్తికి దర్పణం పడుతూ త్రికరణశుద్ధిగా అమ్మను సేవించిన –కృష్ణవేణమ్మక్కయ్య, గజేంద్రమ్మక్కయ్య, హరిదాసుగారు వంటి సోదరి సోదరుల యోగక్షేమాన్ని విచారించి, ఆదుకున్నాడు.
'మాతుః పవిత్రచరణౌ శరణం ప్రపద్యే' అంటూ అమ్మకు శరణాగతుడైనాడు.
వివైవానసూయాం న మాతా న మాతా'
సదైవానసూయాం స్మరామి స్మరామి'
-అంటూ సర్వాత్మనా అమ్మను అర్చించాడు .కనుకనే 'నేనెట కేగెదమ్మ కాదని -నిను కాదని' గొంతెత్తి వినమ్రంతో అభ్యర్థించాడు.
''నీలోనేనై' 'నాలో నీవై'
అంతట అమ్మై నిండిన అమ్మ' -అంటూ ఆద్యంతరహిత అమ్మతో తాదాత్య్మం చెందాడు.
అమ్మ విగ్రహప్రతిష్ఠ మహావైభవంగా నిర్వహించాకోవాలని 'మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు' గ్రంథాలను పారాయణ కర్తలకు ఉచితంగా అందజేశాడు.
స్వర్ణోత్సవ సింహద్వార నిర్మాణం: ఆలయాల నిర్మాణం -నిర్వహణ విషయంగా అవిశ్రాంతంగా కృషి చేసి కృతకృత్యుడైనాడు.
‘శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి' మరియు 'శ్రీ మాతృశ్రీ అష్టోత్తర శత నామావళు' లను అర్థవంతంగా హృదయంగమంగా పఠించాలంటే లక్ష్మీనారాయణ అన్నయ్యే సమర్థుడు. అన్నయ్య చదివితేనే ‘అమ్మ’ సంతోషించేది.
అలా అమ్మ హృదయకమలంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిన ‘లక్ష్మీనారాయణ అన్నయ్య’ తేది 13-4-2014 న తన తనువును చాలించి, జన్మదాత జగన్మాత ‘అమ్మలో’ ఐక్యమైనాడు.
'మదర్ అఫ్ ఆల్' పక్షాన అనుంగుసొదరునికి ఆత్మీయతాంజాలిని ఘటిస్తున్నాము.