నాకు బుద్ధి తెలిసినప్పటినుండి నా మనో ప్రపంచంలో ముఖ్య స్థానం ఆక్రమించుకున్నారు మా నాన్న. అప్పుడు తెలియకపోయినా, దానికి ముఖ్య కారణం ఆయన ప్రేమ అచంచలమనీ, నేను చేయగల ఏ తప్పూ ఆ ప్రేమను కదిలించలేదనీ నాలో ఉన్న నమ్మకం. కాని, నాలుగేళ్ళక్రితం ఆయన హఠాత్తుగా మరణించారు. దూరప్రాంతములో వున్న నేను వచ్చేసరికి బూడిదే మిగిలింది. ఉన్నారు, వున్నారనుకొన్న నాన్న అకస్మాత్తుగా రూప మాత్రంగానైన లేకపోయేసరికి నా లోని పకృతి కంపించింది. ఆయన మీద నమ్మకమే నేననై నేను విలవిలలాడిపోయాను. అంతగా ప్రేమించిన నాన్న చివరి క్షణములో నాతో బంధము లేకుండా నేను లేకుండానే బూడిదిగా మారిపోవటం కేవలం ఆర్థం లేకుండా కనిపించింది. అనంతమూ స్థిరమూ అయిన ప్రేమకూ ఈ నిరాకృతికీ సంబంధం కనిపించలేదు. కార్య కారణ సంబంధంగా యీ ప్రపంచాన్ని చూడబోయిన నాకు ఈ సంఘటన, యీ ప్రపంచం యీ సృష్టి సర్వం అర్థ రహితంగా కనిపించింది. నా మనసే బుడిదైపోయింది. ఈ అనర్ధానికి కారణం నాలోనే ఉన్నదేమో అన్న అనుమానం పెనుభూతం అయి కూర్చున్నది. దానికి కారణాలు వివరించటం యిక్కడ అసందర్భం ప్రపంచమూ నేను కూడా ఒక ప్రశ్నార్థంకగా "తప్పుగా" అనిపించింది. దీన్నుంచి ఉత్పన్నమైన దుఃఖం భరించరానిదైనది .

 

రెండేళ్ళక్రితం మా శ్రీ వారు జిల్లెళ్ళమూడి వెళ్ళిరావటం , అమ్మను గురించిన విశేషాలు చెప్పటం జరింగింది. మనసులను సునాయాసంగా చదివే అమ్మ అసాధారణ శక్తి గురించీ అమ్మ దివ్యత్వం గురించీ విన్నప్పుడు చలించని నాకు అకస్మాత్తుగా ఒక వాక్యం వినిపించింది. “తప్పు అనేదే లేదు” అన్నారట అమ్మ! నా ఆశ్చర్యానికి అంతు లేదు. తప్పు లేకపోవటం , ఎలా వుంటుందో వూహించుకోబోయాను. ఆ మాటలో ఎంతో అర్థం కనిపించింది నాకు. నా వ్యక్తిత్వానికి కీలకమైనది అందులోనే వున్నది. అవతార స్వరూపిణి యైన అమ్మతో బంధానికి అదే నాంది..

 

తరువాత అమ్మ అప్పుడప్పుడూ చెప్తూ వచ్చిన సూక్తుల్ని అక్షర దీపాలుగా మాతృశ్రీ సంచికల్లో వేయగా చూసాను. ఒక్కో సూక్తి సృష్టి రహస్యాన్ని యిముడ్చుకొన్న ఒక్కొక్క మంత్రంలాగా తోచింది. ఏమిటీ జ్ఞానం- అని నివ్వెర పోయాను. అంతటి జ్ఞాన మూర్తి అయిన అమ్మను చూడాలని ఆతృత కలిగింది.

 

మనసు కోతి లాంటిది. నా మనసు మరీను. పవిత్రమైనదాన్ని కాలి క్రింద రాస్తుంది. ప్రేమనిధానమైన దాన్ని నాశనం చెయ్యాలని ప్రయత్నిస్తుంది. నీ భర్తకు బిడ్డలకు అపకారం జరిగితే? అని ప్రశ్నిస్తుంది. ఎంతో భక్తీ భావంతో నమస్కరిస్తున్నా, అమ్మ కీడు చేస్తే? అని శంకిస్తుంది. ఇన్ని రకాలైన ఆలోచనలతో ఉన్న మనసును సునాయసంగా చదవగల అమ్మ ముందు కూర్చున్న నాకు భయం వేసింది. కాని భయం క్రమంగా తొలగి పోయింది. అమ్మ అనటం లోనే రక్షణ అయింది. తప్పు అనేది లేదని చెప్పింది. నేను ఎందుకు భయపడుతున్నాను? అమ్మ చుట్టూ ఉన్నా తేజో మండలం నన్ను సమ్మోహితురాల్ని చేసింది.

 

ఆమెకు అన్నీ తెలుసు.-- నా సందేహమూ స్థితీ కూడా. ఆమె అడగకుండానే సమాధానం ఇవ్వవచ్చు ఎందుకు ఇవ్వరాదు? అనే ఆలోచన వచ్చింది. కొంతసేపున్నాక చెప్పగలిగాను.- నా మనసుకు ఏకాగ్రత కుదరటం లేదని , ఎప్పుడూ అమంగళాన్ని గురించే ఆలోచిస్తూ ఆత్మ వినాశాన్ని కోరుతూ ఉందనీ ఈ చెప్పటములో, దూరంగా ఉన్న నన్ను అమ్మ దగ్గరికి పిలవటం, నేను వెళ్లి అమ్మ ఒళ్ళో వాలిపోవటం జరింగింది. ఏకాగ్రత కోసం యామైనా ప్రయత్నం చేశావా? అని అమ్మ అడిగింది. ధ్యానం ప్రయత్నించానన్నాను. 'ఏమైనా మూర్తిని ఉద్దేశించావా?' అని అమ్మ ప్రశ్నించింది. నా మనస్సు అమంగళమైంది కనుక కల్యాణమూర్తి లక్ష్మిని ధ్యాన్నిస్తున్నానని చెప్పాను. చిత్రమైన మధురమైన చిరునవ్వు నవ్వింది. అప్పటి అమ్మ నవ్వుకు అర్థం తెలియక పోయినా యిప్పుడు తెలుసు. నేను యింతకాలం బట్టి ధ్యానిస్తున్న మంగళ స్వరూపిణి అమ్మే కదా!

 

ఇంతకు మునుపు నా దృష్టిలోని భగవంతుడు యీ సృష్టికీ సుఖఃదుఖాలకు అతీతుడు. సంబంధం లేనివాడు. ఆయన కథల్లోని యమధర్మరాజులాగా కూర్చోని శిక్షిస్తూ ఉండక పోయినా, నా పొరబాట్లకు నా తప్పులకు నా లోని మాయకు ఫలితం అనుభవించి తీరాలి. నేను- విధి అనుకున్నా, కార్యకారణ సంబంధం అనుకున్నా నా స్వభావాన్ని అధిగమించ గల జ్ఞానం నాకు ఎక్కడనుండి వస్తుంది. నాకు రక్షణ ఏది?

 

కాని ఏ జ్ఞానమూర్తి ఒళ్లో నేను తలపెట్టుకొని ఉన్నానో , ఆమె ప్రేమ మూర్తిగా కూడా ఉన్నది . తప్పు అనేది లేదని చెప్పింది. నా దుఃఖాన్ని మోస్తూ నాకు మార్గం చూపెడుతోంది.

 

'అమ్మా, జ్ఞానానికి ప్రేమకు సంబంధం ఏమిటని' అడిగాను. “ప్రత్తికీ దారానికీ వుండే చూస్తే సంబంధం . రెండు ఒకే పదార్థమైన ప్రత్తిని చూస్తే దారం జ్ఞాపకం రాదు. దారాన్ని చూస్తే ప్రత్తి జ్ఞాపకం రాదు. జ్ఞానం ప్రేమా కూడా వేర్వేరుగా కనిపిస్తున్నా రెండూ ఒకేటే ఆవుతాయి..... సాధారణంగా ప్రేమ వాడేది మనిషి మీదనో దేనిమీదనో పరిమితంగా లగ్నమైనప్పుడు దాన్ని మమత అంటారు " అన్నారు అమ్మ

 

ఈ వివరణ మీద మనసు లగ్నం చేయగా, రెండూ ఎలాగా ఒకటవుతాయో బోధ పడింది. ఒక వస్తువు గురించి పూర్తిగా తెలియటమే జ్ఞానం ప్రేమా కూడా అవుతుంది .

 

"గ్రహాల స్ధితి గతులకూ మనిషి జీవితానికీ సంబంధం వుందా? జ్యోతిష్య శాస్త్రం

 

నిజమేనా?" అడిగాను. 'చెప్పేవాళ్ళమీద ఆధారపడివుంది' అన్నది అమ్మ. ’ సైకాలజిస్టులు మనిషి గుణానికి కీలకమైన సంఘటన ఉంటుందనీ దాన్ని గురించి సరిదిద్దటం ద్వారా మనిషి గుణం లోని వక్రత ని సరిదిద్దవచ్చనీ అంటారు కదా’.... అన్నాను. 'ఉండవచ్చు' అన్నది అమ్మ. అల్లాంటి చిన్న కిటుకు ఏమైనా ఉంటే నా విషయం లో చేయరాదా? నమ్మకం చాలకపోవటం వలననే కదా యీ బాధ . నమ్మకం కలిగించారాడా! అని అడిగాను. చిన్న కిటుకా?..... అని నవ్వింది అమ్మ దగ్గర తీసుకొని. అక్కడున్న అందరూ నవ్వారు. కాని. ఆ చిన్న కిటుకే అమ్మ చెయ్యబోతోందని ఎవరికీ తెలుసు? ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు -అమ్మా! నీవు అన్నం పెడితేనే నేను తింటానని అంటే పెడుతుందా? అన్న ఆలోచన మనసులో తోచి మాయమైంది. సంభాషణ పూర్తి అయిన తరువాత అమ్మ లేచి నన్ను తీసుకొనివచ్చి నాకు అన్నం పెట్టింది. ఈ సమయంలో అమ్మనే ఆరాదించి తరించిన రవి అనే అబ్బాయి వృత్తాంతం చెప్పింది. చివరి ఘడియల్లో రవి తన మరణ సమయాన్ని గుర్తెరిగినవాడై , 'యింకొక రెండు గంటలు' యింకొక గంట' అంటూ తరిగి పోతున్న ఆయు: పరిమితిని గురించి నిర్వికారంగా చెప్తూ అమ్మ మీదనే ధ్యాస నిలిపి , సంతోషంగా శరీరాన్ని వదిలేశాడు. ఈ సందర్భములో అమ్మ ఒక విషయం చెప్పింది. ఎదురుగ్గా కనిపిస్తున్న దేవుణ్ణి విడిచి, తరువాత ఏమౌతుందో, లీనం కావడమంటే ఎలాంటిదో తెలియని స్థితి లోనికి నిస్సందేహంగా సంతోషంగా వెళ్ళిపోయాడు రవి అన్నారు. రవి మీద ప్రేమ అమ్మ ముఖంలో, స్వరంలో నిండుగా కనిపించింది. ఎంత అదృష్టవంతుడు రవి! అమ్మ చెప్పిన విషయం మీద ధ్యానం నిలుపగా - రవి ఏ పరిస్థితుల్లో అలా చేయగలిగాడో , రవికి పరమాత్మ అయిన అమ్మను గురించి జ్ఞానం యెంత సత్యమూ పూర్ణమూ అయినదో అవగతమయింది. ప్రకృతికి మార్పు సహజమనీ ఎల్లవేళలా అది మారుతూనే వుంటందనీ పుట్టుకా చావు కూడా మార్పులేవనీ, వినాశ మనేది లేదని విశదీకరించింది. అమ్మ. లీనం కావడం గురించి ఆలోచించగా చావును గురించిన నా భయాలు తొలగిపోయాయి.

 

మరో సందర్భంలో ‘మనిషికీ జంతువుకూ వుండేభేదం’ ----‘మనిషికీ మనిషికీ వుండేభేదం’ లాంటిదేనని జంతువులకూ COMMUNICATION , మమత, త్యాగం ,భక్తీ, జ్ఞానం అనే లక్షణాలన్నీ వున్నాయని నొక్కి చెప్పారు. 'వసుంధరా, నేనూ ఒకసారి బోల్తాపడ్డాను' అంటూ హాస్యంగా సంఘటన చెప్పి తద్వారా తాను కాలానికి అతీతురాలనీ, అంతంత కాలమే తాననీ తెలియజేసింది. అమ్మ ఒక వకీలుగారితో 'నేను నిన్ను పలానా చోటు 1918లో చూశానని చెప్పారు. ఆ వకీలు ఆ సమయములో అక్కడ వున్నది నిజమే కనుక "ఓహో" అనుకున్నారు. కాని యింటికి వెళ్ళాక ఆలోచించగా అమ్మ జన్మించినది 1923 లో ననే జ్ఞాపకం వచ్చి వివరణ కోసం మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చారట.

 

అమ్మను ఉద్దేశించి ఘంటసాల పాడగా రికార్డు చేయబడిన ప్రార్ధన గీతాలు టేప్ రికార్డు మీద ప్లే చెయ్యమన్నారు అమ్మ. అక్కడేవున్న ఒకరి మనసులోని కోరికకు సమాధానంగా అలా చెప్పారని తెలియని దాననైన నేను ఆ పాట వింటూ శ్రీరంగనాధునిలా పడుకొని ఉన్న అమ్మను చూసి ఆశ్చర్య పోయాను . రాతి విగ్రహాలకు తప్పించి, తనను గూర్చి గానం చేస్తూ వుంటే వింటూ ఉండటం అలనాటి శ్రీకృష్ణుడికి ఈ నాటి అమ్మకే చెల్లింది అనుకున్నాను. దీంట్లో కించిత్తు అహంభావం లేదా? అనిపించింది. కాని ఆలోచించగా అహం ఉంటేగా గదా అహంభావం ఉండేది! సర్వజగత్తూ తానే అయిన అమ్మకు అహం అంటే ఏమిటి? అని అలోచించి -కించిత్తు కూడా అహం లేనందువల్లనే అమ్మకు అలా వినటం సాధ్యం అని గ్రహించాను. అహంభావం ఉండే నేను నా భావాన్నే అమ్మకు ఆపాదించానని తెలుసుకున్నాను.

 

ఈ విధంగా సూక్ష్మరూపం దాల్చిన పరమేశ్వరుని చూచి యింతవరకూ నా మనోపరిధిలో ఉన్న భగవంతుని రూపు సరిదిద్దపడినది. నాకు నమ్మకం ప్రసాదించిన కిటుకు, అమ్మ చేసిన అద్భుతం ఆ రాత్రి నును పడుకున్నకనే జరిగింది. దాన్నుంచే నా నమ్మకం సత్యమూ స్థిరమూ అయింది. అది కేవలం నాకు సంబంధించినదే గనుక దానిని గురించి నేను ఎవరికీ చెప్పదలుచుకోలేదు. ఒక అద్భుతం మాత్రం జరిగిందని చెప్పగలను. దాని ఫలితంగా అమ్మ స్వరూపం మరింత స్పష్టంగా తెలియవచ్చింది. ఇంతకు ముందు అర్థం గాని విషయాలు అర్థమయ్యాయి. అమ్మ జ్ఞానమూ, మాయా. రూపమూ భావమూ క్రమానుగాతమైన కాలమూ సర్వకాలమూ అన్నీ తానే ఏ విధంగా అయిందో తెలిసింది. ప్రపంచమే మరో రూపంలో కనిపించింది

 

ఎందువలన నేను ప్రశ్న అడక్కుండా అమ్మ సమాధానం యివ్వదో తెలిసింది. ప్రశ్నకు అంతేక్కడా? పూర్ణమైన జ్ఞానం లభించే వరకూ సందేహం మనోరుపంలో ఉంటూనే వుంటుంది. "మనసులోని సందేహం' అనేది స్థిరమైనది ఒకటి కూడా లేదు. అది మాయ . దానికి నేను రూపం కల్పిస్తేనే తప్ప సమాధానానికి రూపం రాదు మరి!

 

విశ్వరూప సందర్శనమంటే యిది గాక మరేమిటి? భారతంలో చెప్పబడిన దానిని సినిమాల్లో చూపినట్లయితే అది ఉత్త గారడీ అని త్రోసీ వేస్తాము. సినిమాల్లో కనిపించేదంతా గారడియే గదా మరి! అమ్మ అంటే రక్షణ, తద్ద్వార కలిగే నమ్మకం లేకుండా వ్యాధిగా వ్యాపించిన యీ కాల పరిస్థితిలో , పరమాత్మ అమ్మ రూపంలో రావటం యెంత సమంజసంగా వుంది.!

 

అక్కడినుంచీ వచ్చేస్తుంటే సత్యం లోంచి మాయ లోనికి ఆత్మ నుంచీ ప్రపంచంలోనికి వస్తున్నట్లనిపించింది. కృష్ణుడు భగవంతుడని తెలుసున్నాక, భక్తు రాండైన గోపికలు ఎప్పుడూ కృష్ణుని సాన్నిధ్యంలోనే ఉండకుండా వాళ్ళ వాళ్ళ సంసారాలు నిర్వర్తించిన వైనం గోచరించింది. 'మాయలో- సత్యాన్నీ' 'ప్రపంచములో-ఆత్మనీ' గ్రహించటములోనే భగవత్ స్వరూపాన్ని గ్రహించగలము. ఈ సత్యాన్ని తెలుపుటానికే అమ్మ యీ రూపం ధరించింది.

 

ఇక మహిమలూ సత్యాలూ కోరేవాళ్ళకి------

 

మేము జిల్లెళ్ళమూడికి బయల్దేరాలనుకున్న సమయానికి, అంతవరకూ కులాసాగా వున్న మా పన్నెండేళ్ళ బాబుకి గంటకోసారి చొప్పున విరోచనాలు . ఏమైనా ప్రయాణం ఆగకూడదు అని మందు తెప్పించి , బస్సు టైముకు పదినిమిషాలు ముందే బస్సు స్టాండుకు వెళ్ళాము. అయిదు నిమిషాలు ముందే బస్సు వెళ్లి పోయిందనీ , మేమనుకున్న రైలుకు అందుకోలేమనీ తెలిసింది. ఈ పల్లెటూర్లో వుండే ఒకే ఒక టాక్సీ కోసం కబురు పెడితే అది గంటకు ముందే ఎవరో మాట్లడేసుకున్నారు. గంటన్నర తర్వాత గాని మరో బస్సు లేదు. ఏమైనా వెనక్కి పోకూడదని అరగంటపైగా అక్కడే నిలబడ్డాము...... మమ్మల్ని రైలుకు ఎక్కించగల బస్సు వచ్చింది. ఆ వేళ బస్సుల్లన్నీ ఆలస్యమనీ ముందుగా వెళ్ళినది ముందు బస్సనీ తెలిసింది.

 

ఎంత చిత్రంగా పొరబాటు జరిగింది. పరీక్షలో నెగ్గామనుకొన్నాం. బాబు విరోచానాలు నిలిచి పోయాయి. ప్రయాణం సవ్యంగా జరిగింది.

 

తిరిగి వచ్చేటప్పుడు మావీలును బట్టి మేము వస్తే, వాటిటైముతో నిమిత్తం లేకుండా టాక్సీ గాని, రైలుగాని బస్సుగాని మాకోసమే ఏర్పాటు చేసినట్లుగా మమ్మల్ని ఊరుకి చేర్చాయంటే నమ్మాలి. చివర్లో ఒక చోట యింకో గంట సేపు బస్సు కోసం ఎదురు చూడాలనుకున్నప్పుడు టాక్సీలు లేనిచోట రెండు నిమిషాలలో ఒక టాక్సీ వచ్చి ఎక్కించుకుంది. పైగా 'యింకో దగ్గర దోవన వెళ్ళానుకున్నాను గాని , ఏమో ఇటు వచ్చేసాను' అన్నాడు టాక్సీ డ్రైవరు! ఇదంతా అమ్మ "ప్రేరణ' అని కాదనగలమా?

 

Author: 
వసుంధర అక్కయ్య
Source: 
మాతృశ్రీ మాసపత్రిక ఏప్రిల్ 1967 ( సంపుటి 2 సంచిక 1)