1983-1984 సంవత్సరంలో నాకు స్పాండిలైటిస్  వచ్చింది. ఎడమ భుజము, మెడ చాలా పొటుగా ఉండేది.మెడపట్టీ పెట్టాను. మందులు తిన్నాను. ఎన్నో చేశాను. రోజూ నా వృత్తి పరంగా 200 కి.మి తిరగాల్సిన అవసరం ఉంటూ ఉండేది. పగలంతా తిరుగుతూ ఉండేవాడిని . రాత్రి  వచ్చేటప్పటికి  పోట్లు ఎక్కువయ్యేవి.కింద పడుకుని దిండు లేకుండా ఒక దుప్పటి తల కింద పెట్టుకుని పక్కనే టేప్ రికార్డర్ పెట్టుకుని అమ్మ నమ్మం కానీ , అమ్మ సంకీర్తన గానీ వింటూ  నిద్దరపొయేవాణ్ణి  ఎప్పుడు టేప్ ఆగిపోయేది.

 

ఇలాకొన్నాళ్ళు  గడిచింది. కానీ ఒకరోజు చాలా సివియర్ గా పెయిన్. తట్టుకోలేనంతగా వుంది. మూడు టేప్ లు తిరిగిపోయినా నిద్దరలేదు. బాధను భారయించటం కోసం, నిద్దరపట్టటానికి డాక్టర్లు పెయిన్ కిల్లర్స్, నిద్రమాత్రలు సజెస్ట్ చేశారు. కానీ నేను అవి కొనుక్కోలేదు. అవి అలవాటు అయితే తగ్గదేమో అనే భయంతో. ఆ రోజు అనిపించింది - నిద్రమాత్రలు కొనుకున్న బావుండేది అని. ఈ బాధ భారయించే బదులు ఓ పాతిక ముప్పై నిద్రమాత్రలు మింగి ఈ తనువు చాలించివుంటే  బాగుండేది అని . అలా అనుకుని అమ్మను తలుచుకుంటూ పడుకున్నాను . అంతలోకి నిద్రపట్టింది తర్వాత ఆదివారం మాములుగా జిల్లెళ్లమూడి జేరాను. అమ్మ దగ్గర కూర్చొని ఉన్నపుడు - దీని వ్యవహారం నా మనసులో వచ్చిన ఆలోచనలు ఎవీ అమ్మకు చెప్పకుండా అమ్మతో అన్నాను -'ఎప్పుడైనా ఏ కారణంచేతనైనా, నేనేదైనా చేసుకుంటే నీవు అడ్డం రాకు ' అని . కారణం ఏదైనా నిద్రమాత్రలు మింగిన నన్ను చూసి, హాస్పిటల్ కు తీసుకువెళ్లి , కక్కించి నానాగందరగోళం అవమానాలు పాలు కాకుండా, తనువు చాలించిన తరువాత ఎవరు చూచిన పర్వాలేదు అనే ఉద్దేశంతో.

 

"నువ్వేవరివిరా చెప్పటానికి, నే అడ్డం వచ్చేది వచ్చేదే" అంది.

 

"అలాగైతే ఈ శరీరం లో ఏ ఒక్క అవయవము అయినా - నీకు గాని, నాకు గాని, ఉపయోగపడక పోయిన రోజున నన్ను నీలో కలుపుకో  " అన్నాను.

 

అమ్మ నవ్వి ఊరుకుంది .

 

తర్వాత నా స్పాండిలైటిస్ తగ్గిపోయింది. హాయిగానే ఉన్నాను. కానీ 2000 సంవత్సరంలో ధర్మ సూరి , భగవతి వాళ్ళు బెంగుళూరు లో వుండగా సమ్మర్ లో హాయిగా గడుపుదామని బెంగుళూరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వారం పది రోజులకి 'వైరస్'  అంటే సర్పివచింది. మొహం నిండా సన్న సన్నని కురుపులు అద్దంలోకనపడ్డాయి. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఇది సర్పి - అంటే ఇది అమ్మవారు, చిన్న అమ్మవారు, పెద్ద అమ్మవారు,స్పోటకానికి సంబంధించిన వ్యాధి ఇది.  

 

అయితే చాలా నొప్పి వుంటుంది. తట్టుకోవటం కష్టం గా వుంటుంది అని సూచనప్రాయంగా చెప్పి సర్పి కి మందులు ఇచ్చారు. హెవీడోస్ లో మాత్రలు వాడుతున్నాను. ఒక రోజు గడిచిపోయింది. రెందోరోజు గడిచింది . ఏ మాత్రం నొప్పి లేదు కానీ కంటి లోకూడా పోయటం వలన కంటిలోనుంచి నీరు కారుతూ వుండేది. అట్లా అయిదు రోజులు గడిచింది. మనసుకు చిలిపి ఆలోచన వచ్చింది. డాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు చాలా పెయిన్ వుంటుంది, అందులో కంట్లో కూడా పోసింది కనుక ఇంకా ఎక్కువ నొప్పి గా  వుంటుంది- ఎలా తట్టుకుంటారో అని సూచనప్రాయంగా చెప్పాడు. కానీ నాకు మాత్రం పెయిన్ గాని ఏమి లేదు - ఒక్క కంటి నుండి నీరు కారడం తప్ప. ఈ ఆలోచన వచ్చి, డాక్టర్లు సరిగా డాయగ్నోసిస్ చేయలేదనో, లేక డాక్టర్లు కు తెలియదనో సర్పి వ్యవహారం అని - నాలో ఒక రకమైన నిర్లక్ష్య భావం, డాక్టర్ల యొక్క సమర్ధత మీద కలిగింది అనుకున్న క్షణం లోనే తలలోంచి పోట్లు, కంట్లో ఒక గడ్డ పలుగు తో  పోదిచినంత బాధ వచ్చింది. రెండు క్షణాలు తట్టుకోలేక లేచి అటూ ఇటూ తరట్లాడుతూ గోడకేసి తలకాయకోట్టుకుందామ అన్నంత  స్థితి కి వచ్చింది. కొట్టుకుందామనే  స్థితి రాగానే తగ్గింది. అప్పుడు అనిపించింది. నేను అనవసరంగా డాక్టర్ల యొక్క సమర్ధత అనుమానించినందుకు,"అమ్మ నాకు బాధలేకుండా చేసిందనే భావన రానందుకు" బహుశా వాళ్ళు చెప్పింది నిజమేనాన్నా దీంట్లో ఇంత భాద వుంటుంది , కానీ నేను దేనికి నీవు బాధపడకుండా చేయటం కోసం నివృత్తి చేశాను. అనే సూచనప్రాయంగా మనసుతో తోచేటట్టు చేసింది.

 

నీరు కారటం చూపు తగ్గటం కనబడుతూనే వుంది. తెలుస్తూనే వుంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది . అమ్మ తో నేనన్నమాట "అమ్మా ఈ శరీరం లో ఏ అవయవమైనా నీకు గాని, నాకు గానీ ఉపయోగాపడక పోతే నన్ను నీలో కలుపుకో  అని రిక్వెస్ట్ చేశాను, కాబట్టి ఈ కంటి చూపు పోతే నా శరీరం లో  ఒక అవయవం పని చేయనట్టే  కనుక నన్ను నీలో కలుపుకో" అని అమ్మను రిక్వెస్ట్ చేశాను మనసులో.

 

మాములుగా భోజనం చేస్తూనే వున్నాను. స్నానం చేస్తూనే వున్నాను . ఒక కంటి తో  పుస్తకం చదువుతూనే వున్నాను. కాలక్షేపం చేస్తూనే వున్నాను. ఈ అనుకున్న రోజు స్వప్నంlo కనిపించింది. నా కంటి వైపే పదిహేను నిముషాలు చూస్తూ ఆ స్వప్నం గడిచింది.

 

ఆ మరుసటి రోజు నుంచి సర్పి మొత్తం తగ్గిపాయింది. కంట్లో నీరు కాస్త తగ్గటం మొదలైంది. అనుకోకుండా హోమియో డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. డూయాలిటి పోయి మళ్ళి సింగులర్ లో కి వచ్చింది. దృష్టి మాములు స్థితి కొచ్చింది. అంటే ఆ సర్పి వల్ల పడాల్సిన బాధను బాధలేకుండా రోగాన్ని అనుభవించా. అవయవంపోతే నేను అమ్మ తో  విన్నవిన్చుకున్నట్లు నేను శరీరాన్ని వదలాలి కానీ కన్ను నయం చేసింది. జిల్లెళ్లముడి వెళ్ళినప్పుడల్లా అమ్మపడుకోనున్న, కుర్చోనున్న, నా రెండు కళ్ళని అమ్మ రెండు కాలి బొటన వేళ్ళకు ఆనిచ్చే అలవాటు.

 

కళ్ళు ముసుకుని నా కనుగుడ్డును అమ్మ కాలిబోట ను  వేలుకు ఆనించి నమస్కారం చేసే అలవాటు. ఒక రోజు అమ్మ మంచి గాడనిద్ర లో వుంది. లోపలి కి  వచ్చాను. నిద్రబోతోందని రెండు కళ్ళు మూసుకుని వంగి అమ్మ బోటనువేలుకు రెండు కంటి గుడ్లను ఆనించి నమస్కారం చేస్తుండగా - "గోరు గుచ్చుకుంటుంది నానా " అంది. గాడ నిద్ర లో వుండి, నేను అమ్మ నిద్రలేస్తుందేమో అని  తాకి తాక కుండా అమ్మ బాటను వేలుకు నా కళ్ళు ఆనిస్తూ నమస్కారం చేస్తున్నపుడు కూడా -"గోరు గుచ్చు కుంటుంది నాన్నా" అని నా యొక్క క్షేమాన్ని, నా స్పర్శ ని గుర్తించి అన్నది.

 

అంటే నిద్రలోవున్నా, శరీరంతో లేకపోయినా మనక్షేమాన్ని అమ్మ ఎప్పుడూ కాంక్షిస్తూ మన వెనుక వుండి మనల్ని కాపాడుతూ ఉంటుందని ఇంత కన్నా దృష్టాంతం వేరే ఏమి లేదని అనిపిస్తుంది.

 

Author: 
రాచర్ల లక్ష్మి నారాయణ
Source: 
తత్వమర్ధస్వరూపిణి - జూన - 2006