లోకంలో రకరకాల మనుషులను, వింత వింత ప్రవర్తన గల వ్యక్తులను మనము నిత్యమూ చూస్తూనే ఉంటాము. రూపంలో సమానుముగా వున్నారనుకుంటే పిలుపులోనూ, పిలుపులో సమానుమనుకుంటే చూసే చూపులోను, ఖేదం కనిపిస్తూనే ఉంటుంది. అవి అన్నీ సమానుముగా ఉన్నాయని అనలేము. ఒక వేళ ఉన్నాయని అనుకుంటే ఏ అవయవం లోనో, నడకలోనో, నడవడిక లోనో ఖేదం కనిపిస్తూనే ఉంటుంది. అలాగే "నన్నెవరూ అర్థం చేసుకోరేం?" అన్న మాటలను కూడా మనం నిత్యమూ వింటూ వుంటాము, మనము కూడా అంటూ వుంటాము.
ఎవ్వరూ తనను తాను పూర్తిగా అర్థం చేసుకోలేరు!
అటువంటప్పుడు యితరులు తననెందుకు అర్థం చేసుకోరు? అనుకోవడం అవివేకం, తనను తాను అర్థం చేసుకోవడమే కష్టమైనప్పుడు ఇతరుల గురించి తనేం అర్థం చేసుకోగలడు? సామాన్య మానవుడినే అర్థం చేసుకోవడమే యింత కష్టమైతే మరి, మానవాతీత, మహా మహిమాన్విత అయిన అమ్మను గురించి అర్థం చేసుకోవడం మనతరమా?
అమ్మను అర్థం చేసుకోవాలంటే యీ జన్మ కాదూ గదా! ఎన్ని జన్మలెత్తినా మన ప్రయత్నం వ్యర్తమేమో అనిపిస్తూంది.
అమ్మదర్శనానికి వెళ్లి అమ్మకేడురురుగా కూర్చుంటే అమ్మ " మనవైపే చూస్తుంది. నన్నే ప్రేమగా చూస్తుంది నన్నే చూసే అమ్మ నవ్వుతుంది." అని అనుకుంటాము. కాని. అది కేవలం మన భ్రమ మాత్రమే.
సర్వ జనులకు జన్మ నిచ్చిన అమ్మ మనల్నే ప్రేమిస్తుంటే, మిగతా బిడ్డల సంగతేం కాను? -ఈ విషయం మానవులలోనే కనిపిస్తుంది తప్ప జగదేకజనని అమ్మలో ఏ మాత్రం కనిపించదు.
భూమి గుండ్రంగా ఉందన్న సంగతి అందరికి తెలిసిన విషయమే! ఇటువంటి భూమికే ఆధారభూతమైన అమ్మ మన పూర్వజన్మ తపః ఫలంవలన ఈ భూమిపై మానవిగా అవతరించింది. దుష్టులను సహితం తన ప్రేమ పూర్వకమైన కటాక్షవీక్షణాలతో పరిశుద్ధులునుగా మారుస్తుంది.
"ఆ దుష్టులుకూడా నా బిడ్డలే!- నేను దగ్గరచేర్చుకోకుంటే వారిని ఎవరు ఆదరిస్తారు?" అంటుంది అమ్మ.
మానవుని చూపు సాధారణంగా కొంత దూరమే ప్రసరిస్తుంది. కాని, అమ్మ చూసే చూపు దిగంతాలకు ప్రసరిస్తుంది. ఆ చూపులోని అవాజ్యమైన నిర్మలమైన వాత్సల్యమే అందర్నీ ఆకర్షిస్తుంది. అందరిపై ప్రేమ వర్షం కురిపిస్తుంది. మాటల సందర్భములో అమ్మ అప్పుడప్పుడు అంటుంది. "తనను కన్నా వాళ్ళకన్నా తాను కన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది." అని. ఈ విషయం మనం నిత్య జీవితములో అనుభవంలో ఉన్నదే కాని, అమ్మ మాకి జన్మ ఇవ్వలేదే! మరి ఎందుకిలా అందర్నీ ప్రేమిస్తుంది? -అన్న విషయాన్ని గురించే తెలుసుకోవాలి, అన్వేషించాలి.
చల్లగాలి వీచివీచగానే నీలిమేఘం మెల్లగా కదలిపోతుంది. చెట్టులోని కొమ్మలు, కొమ్మలోని రెమ్మలు అటూ యిటూ వూగిపోతాయి. అలాగే మన మనసు కూడా సంతోషకరమైన వార్త వినగానే ఆనందంతో పొంగిపోతుంది. విచారకరమైన వార్త వినగానే విషాదంతో కృంగిపోతుంది. మరి అమ్మలో యీ పొంగిపోవటంగాని కృంగి పోవడంగాని ఉన్నాయా? -అంటే అలాంటివేమి కనిపించవు.
అమ్మ వదనాన్ని పరిశీలనగా చూస్తే- అమ్మ నవ్వుతుందో లేక బాధననుభవిస్తున్నదో అర్థం కాదు. అది నిశ్చలస్థితి పగటికి రేయికి మధ్య సంధ్యాసమయంలాగా సుఖదుఃఖాల కతీతంగా ఉంటుంది. ఆ వదనం! ఆహా, ఏమా నిర్మలత్వం! నిర్వికారం!
అమ్మ సుందర వదనారవిందాన్ని చూస్తుంటే-- యింకా యింకా చూడాలనిపిస్తుంది. మనసు ఆనందసాగరతీరంలో ఓలాడుతున్నట్లు అనిపిస్తుంది. అమృతాన్ని అస్వాదితిస్తున్నట్లుంది.
అమ్మ దర్శనానికి క్రొత్తగా వచ్చిన వాళ్లతోకూడా ఎంతో సన్నిహిత సంబంధం వున్నట్లుగా ప్రేమగా మాట్లాడుతుంది. దీనిని బట్టి అమ్మ "మీరంతా నా బిడ్డలు; నేనే కన్నాను"- అన్నమాట నిజమే అనిపిస్తుంది.
ఇటువంటి మహిమలు గల్గిన మానవాతీత అయిన అమ్మ మనకు అండగా వుండి, అభయహస్తమిస్తూ-ఆదరిస్తూ --వుంటే మనకు ఎందుకు భయం? అమ్మ మనకందరికీ అన్ని విషయాలలో మార్గదర్శి.
ఆమె చూపే బాటలో నడచి, మన జీవితాల్ని చక్కదిద్దుకొనగలిగితే మనం ధన్యులమే! అద్దంలో చూసి మన మోమును ఎలా పరిశుభ్రం చేసుకుంటామో అలాగే అమ్మ ప్రవర్తనను చూసి మనలోకుడా పరివర్తన కలగాలి!
అటువంటి భాగ్యం,అదృష్టం మనకందరికీ కలుగజేయమని జగజ్జనని "అమ్మ" పాదపద్మములను నా హృదయ మందిరములో నిల్పి ప్రార్థిస్తున్నాను.