1978 డిశంబర్ 31 వ తేది రాత్రి ...............

 

ప్రతి సంవత్సరం డిశంబర్ 31 వ తేది రాత్రి సరిగ్గా 12 గంటలకు అమ్మ దర్శనం యిస్తుంది. ఆ దర్శనం చేసుకుని గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, రాబోయే సంవత్సరానికి స్వాగతం చెప్పటానికి అనేకులు జిల్లెళ్ళమూడి వస్తారు. క్రొత్త సంవత్సరాన్ని ఆనందప్రదంగా చేయమని కాల స్వరూపిణి అయిన అమ్మను అర్థిస్తారు.

 

ఆ రోజున వచ్చిన బిడ్డల పూజలు అందుకుని అమ్మ, అందరికి బిస్కెట్లూ, రస్కులూ, టీ అందజేస్తుంది. అందరూ కలసి టీ త్రాగుతూంటే వాళ్ళను చూసి అమ్మ తానూ ఆనందపడిపోతుంది.

 

ఆ ఉత్సవం కోసం ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. వేదిక అలంకృతమై సోయగాలను విరజిమ్ముతున్నది . పూజాద్రవ్యాలన్నీ వేదిక వద్దకు తీసికొని రాబడుతున్నాయి

 

రాత్రి గం.11-45 ని. లయింది. అందరు అమ్మ కోసం ఎదురు చూస్తూన్నారు. అమ్మ నామ సంకీర్తన చేసేందుకు మైకు అమర్చాలని ఆంగ్ల సోదరుడు జేమ్స్ ఆ పరికరాలన్నీ సిద్ధం చేశాడు. వాటిని ఒక్కొక్క దానినే కనెక్ట్ చేస్తున్నాడు. అంతలో దభీమని పడిపోయాడు. ఆదుర్దాగా అందరూ చుట్టూ చూచారు. ఏమైంది? కరెంటు వైరు అతని చేతిలో మంటలు విరజిమ్ముతున్నది. చేతిలో నుండి దానిని ఎవరు వేరుచేయగలరు? పోరుబాటున ఎవరైనా ప్రయత్నం చేస్తే -- వారికి ఆ షాక్ తగులుతుంది గదా! కొందరు చూస్తూ నిశ్చేష్టులై పోతే --మరికొందరు కర్రలతోనూ, పై గుడ్డలతోనూ ఆ మండే వైరును అతని చేతినుండి తప్పించటానికి సతమతమైపోతున్నారు.

 

ఆ ప్రయత్నంలో ఎవరు సఫలీకృతులు కాలేదు.

 

సరిగ్గా ఆ సమయంలో మచిలీపట్నం నుంచి సోదరులు శ్రీ ప్రసాద్ వచ్చాడు. అతడు ఎలక్ట్రికల్ యింజనీరు. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని ఆ వైరు మూలంలో ఉన్న ప్లుగ్ ను డిస్కనెక్ట్ చేశాడు. అతను చెప్పాడు ..... జేమ్స్ చేతిలో కరెంటు వైరు అగ్ని శిఖలను విరజిమ్ముతున్నా, అతడు నేలపై పడిపోయాడు కానీ, స్పృహను ఏమాత్రమూ కోల్పోలేదు. పైగా ‘అమ్మా… అమ్మా…’ అని నామం చేస్తున్నాడట. ముఖంలో భయంగానీ, ఆందోళన గానీ ఛాయా మాత్రంగానయినా కనిపించలేదట. అతని శరీరంలో దాదాపు రెండు నిమిషాలు విద్యుత్తు ప్రసారమయిందట. మామూలు పరిస్థితులలో మరెవరయినా అయితే తప్పక మరణించవలసినదేనట.

 

వైరు చేతి నుండి విడివడిన తర్వాత చూస్తే- చెయ్యి కాలిపోయి గుంటలు పడ్డాయి . తర్వాత కూడా అతని మానసిక స్థితిలో ఏ మాత్రమూ మార్పురాక పోవడం అత్యంత విశేషం. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో అతని మనః స్థితి యెట్లా ఉన్నదని అతణ్ణి అడిగితే --- అతనికే మాత్రమూ భయం గాని విచారం గానీ వేయలేదని చెప్పాడు. ఆ సమయంలో కూడా అమ్మ నామం మరుపుకు రాకపోవటమే అతని అదృష్టం. జేమ్సు సోదరుడు బుద్ధిమంతుడన్నయ్య తో మాట్లాడుతూ, "అమ్మ గోపాలన్నయ్యను రక్షించిందీ; నీకు ప్రాణ దానం చేసిందీ అని వింటుంటే అదేమిటో నాకు అర్థమయ్యేది కాదు. ఇవ్వాళ నాకు అనుభవపూర్వకంగా అవగతం అయింది. అమ్మ కరుణామయి.....అమ్మ ప్రాణ ధాత్రి....." అని వివరించాడు.

 

అమ్మ రాత్రి 12 గంటలకు అమ్మ చిరునవ్వులు చిందిస్తూ వేదిక పైకి వచ్చింది; పూజలూ, వేడుకలూ నిర్విఘ్నంగానూ ఆనందంగానూ గడిచిపోయాయి. అందరూ అమ్మ కారుణ్యానికి అంజలి ఘటించారు.

 

ఇటువంటి సంఘటనే 1968లో జరిగింది. జిల్లెళ్ళమూడి లో అమ్మ సన్నిదిలో స్థిరపడిపోయిన కుటుంబాల్లో శ్రీ పోతుకూచి విద్యాసాగర్ గారి కుటుంబమొకటి. ఆ కుటుంబంలోని సభ్యులందరూ అమ్మపై ఎనలేని భక్తి విశ్వాసాలు కలవారు. ఎల్లప్పుడూ అమ్మ నామం చేస్తూ ఉంటారు. శ్రీ విద్యాసాగర్ గారి కుమార్తె కుమారి ఝాన్సీకి మే 10 వ తేదిన హఠాత్తుగా పెద్దప్రమాదం జరిగింది. తిరిగే మోటారు చక్రంలో ఆ అమ్మాయి జుట్టు యిరుక్కుంది. ఆ చక్రభ్రమణ వేగానికి చక్రంలో జుట్టుతో బాటు - చర్మాన్నీ కూడా లాగేసింది. కేవలం దైవలీల అనుకోవాలి- హఠాత్తుగా ఎక్కడినుండో ఎవరో వచ్చి స్విచ్ ఆఫ్ చేశారు; చక్రం ఆగిపోయింది. కానీ, ఆ అమ్మాయి స్పృహ లేని స్థితిలో నెత్తురు మడుగులో పడిపోయింది. వెంటనే కారులో ఝాన్సీని గుంటూరు ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాం. మాకందరికీ ఆందోళనగా ఉంది. కానీ, - విచిత్రమేమంటే .... స్పృహలేని పరిస్థితిలో కూడా ఝాన్సీ లయ తప్పకుండా అమ్మ నామం చేస్తున్నది... అంటే ఆ అమ్మాయి శరీరంలో ప్రతి అణువూ కూడా నామాంకితమైపోయింది. ఇక - సర్వ శక్తిమంతమైన ఆ నామం ఆ అమ్మాయిని ఎందుకు రక్షించదూ?

 

తర్వాత వైద్యులు ఊహించనంతగా ఆ అమ్మాయికి గాయం నయం అయింది. అతి త్వరలో కోలుకున్నది. అపుడు ఆ అమ్మాయి బ్రతికినప్పటికీ --మెదడు దెబ్బతినవచ్చునూ, జ్ఞాపక శక్తీ ఆలోచన శక్తీ నశించవచ్చునూ లేక తగ్గి పోవచ్చునూ --అన్నారు వైద్యులు. కానీ, అత్యాశ్చర్యకరంగా ఝాన్సీ విద్య నభ్యసించి, జాతీయ స్థాయిలో అనేక బహుమతులు గెల్చుకుని సాహిత్య విద్యా ప్రవీణలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై ప్రస్తుతం జిల్లెళ్ళమూడిలో కళాశాలలోనే అధ్యాపకురాలుగా ఉద్యోగం చేస్తూ అమ్మ కారుణ్యానికి అమ్మ నామ మహిమకు సజీవతార్కాణంగా నిలిచింది.

 

కనుకనే కొందరు ఎంతసేపూ అమ్మను చూస్తూ , ఆ మూర్తి లోని అలౌకిక తేజస్సుకు ముగ్థులవుతూ, అమ్మ మృదు మధుర వాక్కులు వింటూ, ఆ వాక్ వైభవానికి సమ్మోహితులవుతూ ఆ వచస్సౌందర్యానికి అబ్బురపడుతూ ఆ సన్నిధిలో అనవరతం అనేక విధాల ప్రకటితమయ్యే దివ్యత్వాన్ని ఆస్వాదిస్తూ కాలం గడపటానికి ఉవ్విళ్ళూరుతుంటే -మరికొందరు నిరంతరం అమ్మ నామసంకీర్తన చేస్తూ తన్మయత్వం చెందుతారు. అమ్మ నామ మధువును గ్రోలుతూ పరవశిస్తారు. క్రమేణ నామ మంత్రం వారి శరీరంలో అణువణువునా రోమరోమానా జీర్ణమైపోతుంది. అపుడు అమ్మ వారి వెంట ఉండడం కాక వారిలోనే అమ్మ, ఉన్న అలౌకిక అనుభూతి వారికి కలిగి వారి జీవితాన్నే మధుర తమం చేస్తుంది. ఆ నామశక్తి వారిలో ఎల్లప్పుడూ ఒక దివ్యప్రభ వలే జ్వలిస్తూ వారిని నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. వారు పాడుతూ ఉంటే - అది కాపాడుతూ ఉంటుంది.

 

అట్లా నామాన్ని జీర్ణం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళలో సోదరుడు జేమ్స్ ముఖ్యుడు. అతడికి అదే సాధన; అదే తపస్సు. కనుకనే అంత విద్యుత్తు శరీరంలో అంతకాలం అప్రతిహతంగా ప్రవహించినప్పటికి అతడు స్పృహ ను కోల్పోకపోవడమే కాక మనోస్థయిర్యాన్ని కూడా ఏ మాత్రమూ కోల్పోలేదు. అతడు నామాన్ని వదల్లేదు. నామం అతణ్ణి వదల్లేదు.

 

నామంలో ఎంతో మాధుర్యం ఉంది. ఎంతో మహిమ ఉంది. అనంతమైన శక్తి ఉంది. అపరిమితమైన ప్రభావం ఉంది. మనస్సుకు శాంతినిస్తుంది. మనస్సును ఆనందముతో నింపుతుంది.

 

మనం కోరినప్పుడల్లా మూర్తి మనకు అందుబాటులో లేక పోవచ్చును. కాని నిజంగా అమ్మ చెప్పినట్లు 'అడ్డులేనిది నామమే'

 

                          “జయహో మాతా!

                              శ్రీ అనసూయ!

                                  రాజరాజేశ్వరి!

                                     శ్రీ పరాత్పరి!....”

 

Author: 
కీ.శే. శ్రీ కొండముది రామకృష్ణ
Source: 
మాతృశ్రీ మాసపత్రిక సంపుటి 13 సంచిక 9 & 10 - డిశంబర్ 1978 & జనవరి 1979