ఈ విషయం సుమారు 38 సంవత్సరాల క్రితం జరిగింది .వివరాలు అంతగా గుర్తులేవు. క్షమించాలి.1973-74 ప్రాంతంలో మేము తరచుగా జిల్లెళ్ళమూడి వస్తూ వుండేవాళ్ళం. మా నాన్నగారికి మేము పదిమందిమి సంతానం. పెద్దవాళ్ళకు ఆడపిల్లలకు వివాహాలై వాళ్ల వాళ్ల అత్తగారింటిలో వుండేవారు. మేము చిన్నపిల్లలం. నలుగురం మా అమ్మనాన్నగార్లతో వచ్చేవాళ్లం. పెద్ద సంసారం బాధ్యతలు,బరువులు ఎక్కువ. అందుచేత మా అమ్మ ,మా నాన్నగారిని చిన్న పిల్లల క్షేమం గురించి 'అంఆ' ను ప్రార్ధించమంటూ వుండేది. కాని మా నాన్నగారు 'అంఆ' ఫై కల అచంచల విశ్వాసం చేత (మా అమ్మకు లేదని కాదు. అయినా ఆడమనసు) అడిగేవారు కాదు.
చివరకు ఒక నాటి మధ్యాహ్నం 'అంఆ' గదిలో కొద్ధిమందిమే కూర్చుని ఉన్నప్పుడు మా అమ్మ 'అంఆ'ను అడిగింది .
'అంఆ' చిన్నపిల్లలు -వాళ్ళ చదువులు -ఎంతో భయంగా ఉంది. అంటూ భయం భయంగానే అడిగింది.
'అంఆ' ఈ విధంగా సమాధానం ఇచ్చారు.'అమ్మా!’ నాకూ పిల్లలు వున్నారు. నాకూ కష్టాలు వున్నాయి. అప్పుడు రవి (అమ్మ చిన్న కొడుకు) ఇంకా పసివాడు. బంధువులు ఒకరు పురిటికై ఆస్పత్రిలో వున్నారు. మా అత్తగారు ఆ బాలింతతో వుంటే నేను వారికి కారియర్తో అన్నం తీసుకొని వెళ్లేదాన్ని. ఎండాకాలం, ఒక చేతిలో కారియరు. ఒకచేతిలో రవి చంటివాడు. ఇసుకలో కాళ్ళు కాలుతున్నాయి. కాళ్లకు చెప్పులు కుడా లేవు. కారియరును క్రిందపెట్టలేను. పసివాడిని దింపలేను. అట్లాగే కాళ్ళు కాలుతున్నప్పటికీ. పల్లేరుకాయలు కాళ్లకు గుచ్చుకుంటున్నాయి కూడా. నెమ్మదిగా ఆస్పత్రికి చేరాను.
"అయ్యో! ఇంత ఎండలో వచ్చావా" అని మా అత్తగారు చల్లటినీళ్ళు కాళ్లపై పోసారు. కాలిన కాళ్లఫై చల్లటినీళ్ళు పోయడం చేత పాదాల క్రింద బొబ్బలెక్కాయి" అన్నారు 'అంఆ'. అమ్మ బాధతో కూడిన ప్రశ్నకు 'అంఆ' బాధను గురించిన సమాధానం అలవోకగా, ఏదో కధలా తనకు సంబంధం లేనట్లుగా చెప్పారు.
"కష్టాలు కూడా తన పిల్లలే" అన్నది. 'బాధలు లేని బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా ' అంది. కష్టాలు అనుభవించి - ఆనందించి - మనకు ఆదర్శరూపిణి అయింది అంఆ.
'అంఆ'తో ఏ చిన్న పిల్లల గురించి చెప్పి బాధపడిందో వారందరూ అభివృద్ధిలోకి వచ్చి ఆనందంగా వుండటం చూసి తృప్తిగా వెళ్ళిపోయింది మా అమ్మ .
(చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం కనుక వివరాలు బాగా గుర్తులేవు. ఈ సంఘటన తెలిసిన అక్కయ్యలు,అన్నయ్యలు నేను వదిలేసిన వివరాలు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను ).