అమ్మ నూతన ఆంగ్లసంవత్సర ఆవిష్కరణ వైభవంగా జరుపుతుండేవారు. ప్రతిసంవత్సరం డిసెంబరు 31 సాయంత్రానికి అంతా అమ్మ వద్దకి చేరేవాళ్ళం. ఆవిష్కరణ మహోత్సవం తర్వతా, అమ్మ ఇచ్చే ప్రసాదం, రస్కులు కేకులు బిస్కెట్లు , టీ ఆనందంగా స్వీకరిస్తూ యుండేవాళ్ళం. ఆమె ఆశీస్సులు తీసుకోనేవారం. కొత్త డైరీలతో అమ్మ దగ్గరకు వెళ్ళటం, పూజ చేసుకోవటం, అమ్మ ఆటో గ్రాఫ్ అనుగ్రహించటం, కొత్త క్యాలెండర్లు , కొత్త అకౌంట్ పుస్తకాలు, కొత్త కలాలతో వెళ్లి నమస్కరించటం , అమ్మ అనుగ్రహానికి చిహ్నంగా, వారి నుండి స్వీకరించటం కోలాహలంగా ఆనందంగా రాత్రంతా తెలియకుండానే గడిచిపోయేది. అమ్మ రాత్రంతా, పిల్లలతో ఉత్సాహంగా గడుపుతూ ఉండేవారు. వారిలో ఏ విధమైన అలసట కనబడేది కాదు. అట్లా హాయిగా తెల్లవారేది.
ఒక సంవత్సరం (1962?) ఆ ఉత్సవంలో పాల్గొనటానికి, నేను చీరాల నుండి కుటుంబంతో కారులో డిసెంబరు 31 సాయంత్రం జిల్లేళ్ళమూడికి బయలుదేరాను. కారు 7వ మైలుకు కొంతదూరంలో ఉన్నది. చీకటి పడుచున్నది. పశువులు ఇళ్ళకు చేరే సమయం. అవి రోడ్డు మీద నడుచున్నవి. వాటిని తప్పిస్తూ కారును నెమ్మదిగా నడుపుతున్నాడు డ్రైవరు. ఇంతలో ఒక పశువు కారుకు అడ్డముగా వచ్చింది. కారును దక్షిణం వైపుకు త్రిప్పాడు డ్రైవరు. రోడ్డుకు ఉత్తరం వైపు అంటే మాకు ఎడమ ప్రక్కన నల్లమడ కాలువ . అది చాలా లోతైనది. అంతలో కారు స్టీరింగు పాడయి కారు రోడ్డు ఎక్కలేదు. బ్రేకులు వేసి డ్రైవరు కారు ఆపాడు. కారు స్పీడుగా నడపక పోవటం వలన కారు కాలవలో పడకుండా , పెద్ద ప్రమాదం తప్పిందని డ్రైవరు అన్నాడు. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవటం ‘ అమ్మ అనుగ్రహమే' అనుకుంటూ నడక ప్రారంభిచాము. 7వ మైలు దాటి జిల్లేళ్ళమూడి బాటన ఆడపిల్లలతో సహా అందరం నడుస్తున్నాము. బాట సరిగా లేదు. అక్కడక్కడ ముళ్ళు. పాదరక్షలు లేవు. చీకటి పడింది. నడక అలవాటు లేనివాళ్ళం. అమ్మను స్మరిస్తూ నడుస్తున్నాం. కొద్దిదూరం వెళ్ళగానే , వెనుక వస్తున్న వ్యాను హెడ్ లైట్ల వెలుతురు మామీద పడింది. ఆ వ్యానును ఆపాలనే ఆలోచన మాకు రాలేదు. సహజంగా అమ్మ వద్దకు వచ్చే వెహికల్స్ నిండుగా ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా అప్పటి సెక్రటరీ గారు శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారు వ్యానులో కొద్దిమందితో వస్తూ మమ్మల్ని చూసి ఆపి, ఎక్కించుకొని జిల్లేళ్ళమూడి చేర్చారు. అంతా అమ్మ దయే అనుకొన్నాము.
వెంటనే అందరం అమ్మ దర్శనం చేసుకోన్నాము. " అన్నయ్యా (శ్రీ శేషగిరిరావు గారు) మీరు కలసి బయలుదేరి వచ్చారా?" అమ్మ అడిగారు. “అట్లా కాదమ్మా! మేము చీరాల నుండి బయలుదేరివస్తుంటే, దారిలో కారు స్టీరింగు పాడైంది. మీ దయ వలన ప్రమాదం లేకుండా మీ వద్దకు రాగలిగాము.” అని అన్నాను. ”బ్రేకులున్నవి గదా?” అన్నారు అమ్మ. అంటే కారుకు బ్రేకులున్నవి గదా? అని అమ్మ అడిగారనుకొని "ఉన్నాయమ్మ" అని సమాధానం చెప్పాను. వెంటనే అమ్మ "ఇక్కడ (తన వద్ద) బ్రేకులు ఉన్నవి గదా!" అని చెప్పి నవ్వారు. నా ఆనందానికి అవధులు లేవు. నూతన సంవత్సరం నాడు అమ్మ ఇచ్చిన హామీకి, వారి పాదపద్మములకు కృతజ్ఞతతో నమస్కరించాను .
అన్నీ అమ్మ స్వాధీనమే..... అంతా అమ్మ నిర్ణయమే...... ఆ ధైర్యం తోనే విశ్వాసంతోనే ముందుకు నడుద్దాం