“నీ బిడ్డయందు ఏమి చూస్తున్నావో అది అందరిలో చూడటమే బ్రహ్మత్వం పొందటము” - అమ్మ

 

నీ బిడ్డను నీవు యెట్లా చూస్తావు? ‘ ప్రేమగా’ – అదే ప్రేమ అందరియందు అలాగే అనగా నీ బిడ్డను యెంత ప్రేమగా చూస్తావో అంత ప్రేమగా అందరినీ చూడు అనేదే- అమ్మ ఆంతర్యం. అంటే పరిమితముగా ఉన్న ప్రేమను అపరిమితముగా విస్తరింప చేయమని అమ్మ ఆదేశం. నీ బిడ్డ యందు నీవు ఏమి చూస్తున్నావో అదే అందరిలో చూడు అన్నప్పుడు నీ బిడ్డ యందు ఏమి చూస్తావు? "ఆత్మావై పుత్రనామాసి" అంటే పుత్రునిలో నీ ఆత్మనే చూస్తున్నావు. అంటే నీ బిడ్డలో నిన్నే చూసుకొంటున్నావు అనే అర్థం. "తనని కన్నవాళ్ళ మీద కంటే తానూ కన్నవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ" అని అమ్మ అంటుంది. అంటే తన తల్లిదండ్రులమీద కంటే కూడా తన పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తుందని అర్థం. ఇది సర్వసామాన్యంగా మనం చూచేదే. మన తల్లిదం డ్రు ల మీద కంటే మన పిల్లమీద ప్రేమ మనకు ఎక్కువ వుండటం , మరల మన పిల్లలకు మన మీద కంటే వారి పిల్లల మీద ప్రేమ ఎక్కువగా ఉండటం అతి సహజముగా జరుగుతున్న విషయం. కనుక, మన పిల్లలను ప్రేమించటమే కాకుండా వారిని మన ఆత్మ స్వరూపులుగా చూస్తూ వారిలో బ్రహ్మత్వాన్ని చూస్తున్నాము అన్నమాట. అసలైన అమ్మకు 'ఎవరిని చూసినా తన బిడ్దేననిపిస్తుంది'. కనుక అందరినీ తన బిడ్డలుగా చూస్తే - అట్లాగే ప్రేమిస్తే విశ్వజనని అవుతుంది. కనుకనే అమ్మ 'నేను అమ్మను-మీరు బిడ్డలు' అనగలిగింది. 'నీవే కాదు ఈ చరాచర జగత్తుకు నేనే అమ్మను' అని ప్రకటించగలిగింది. మనము కూడా అట్లా ప్రేమించగలిగితే అందిరిలోనూ అంతటా బ్రహ్మత్వా న్నే చూడగలము. 'అంతా ఆత్మగా తోచటమే ఆత్మ సాక్షాత్కారం' అంది అమ్మ.

 

మనం అనేక సాధనలు చేస్తున్నాము, చూస్తూన్నాము. అన్ని సాధనలు ముక్తిని పొందటానికో లేక ఆత్మ సాక్షాత్కారానికో అయివుంటాయి. మనం మెడిటేషన్ చేసినా, సమాధి స్థితిని పొందినా చివరి గమ్యము మన అస్తిత్వాన్ని పోగుట్టుకుని ఆత్మగా భావించటమే. సర్వ నదులు తమ అస్తిత్వాన్ని పొగుట్టుకొని సముద్రములో విలీనమైనట్లుగా.

 

అమ్మను Embodiment of Love ప్రేమమూర్తీభవించిన ఒక ప్రేమ దేవత అన్నారు. అమ్మ ప్రేమ ప్రయోగం చేసింది. 'ఆ ప్రేమ ప్రయోగాన్నే ఒక సాధనగా చేస్తే ఎట్లా ఉంటుంది?' అని నా మనస్సుకు అనిపించింది. దీనిని పరిశీలిస్తే ఈ సాధన రహస్యా న్ని కనుగొని అవలంబించినవారు అనేకులు ఉన్నారు అని నాకు అనిపించింది. అన్ని ప్రేమలలో మాతృప్రేమ నిష్కల్మషమైనది. ఫలితాలని ఆశించనిది. అందుకే అమ్మ దీనిని ఒక సాధనగా కాక తానే వాత్సల్యమూర్తియై తన ప్రేమానురాగాలను తన బిడ్డలైన సర్వులకు పంచింది.

 

"నేను తల్లిని, మీరు బిడ్డలు, అంతేకాదు , మీరు నాకు అవయవాలు, మీరు కానిది నేను ఏదీ కాదు" అన్నది అమ్మ. తాను ఆత్మ (పరమాత్మ) యై అందరినీ ఆత్మ స్వరూపులుగానే చూచింది.

 

Author: 
శ్రీ కె. బి. జి. కృష్ణమూర్తి జిల్లెళ్ళమూడి
Source: 
విశ్వజనని మాసపత్రిక - సంపుటి 11 సంచిక 2 - సెప్టెంబర్ 2011