ఆ రోజు నేను 1984 సంవత్సరములో జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో మండల దీక్ష లో ఉన్న రోజులు. ఉదయం గం. 5-00 నుండి రాత్రి గం. 9-00 వరకు ఏకాదశ మహారుద్రాభిషేకం సంపూర్ణ సుందరాకాండ పారాయణం, లలితా సహస్రం, త్రిశతి ఖడ్గమాలా, అష్టోత్తర శత పారాయణలతో తీరిక ఉండేది కాదు. దీక్షా కాలంలో కార్యక్రమం అంతా పూర్తి చేసి, అమ్మకు నివేదన ఇచ్చేదాకా ఏమీ తీసుకోరాదని మనసులో నియమం పెట్టుకున్నాను. అప్పుడు కూడా ఫలహారమే కాదు,ఉడికిన పదార్థం గాని, కాచిన పదార్ధం గాని ఏమి తీసుకోరాదని మనసులో నిష్ఠా నియమం.
అట్లా రెండు మూడు రోజులు గడిచినవి. అమ్మ దగ్గరకు పిలిచి "శరీరం శుష్కించి పోతున్నది . పాలైన తాగు నాన్నా! " అన్నది. పాలు కూడా కాగినవే కనుక, రాత్రికి నీవేదన తర్వాత ఏదైనా తీసుకోవాలని నియమం. కనుక పాలు తీసుకోవడానికి విముఖత చూపాను నేను. అప్పుడు అమ్మ పండ్లు ముక్కలు తెప్పించి "ఇవి ఉదికినవి కావు , ఫలహారం అనుకోవచ్చు" అన్నది. అవి కూడా ....నివేదన అయ్యే వరకు తీసుకోదలుచుకోలేదమ్మా! అన్నాను." ప్రసాదంగా ఇచ్చినా తీసుకోవా నాన్నా …..తీసుకో!" అన్నది. నేను ఎవరి అనుగ్రహం కోసం- కారుణ్యం కోసం ప్రసన్నత కోసం --నా యీ దీక్ష సాగిస్తున్నానో ఆవిశ్వ జనని (విశ్వమే జననిగా రూపొందిన) మాతృమూర్తి మమతల ఒడి తనకై తాను ప్రసాదంగా ఇస్తున్నాను తీసుకోనాన్నా! తీసుకో!" అంటున్నది. తినాలా! వద్దా! ఇస్తున్నది దైవం . తినకపోతే నా అమ్మ మాట ఉల్లంఘన, తింటే నా నియమ భంగం సందిగ్ధావస్థలో పడ్డాను. మనస్సులో ఒక క్షణం మధన జరిగిన అనంతరం ఒక ఆలోచన స్పురించించి. (అలా అనటం కంటే అమ్మ ఒక పరిష్కార మార్గం ప్రసాదించింది ఏమో) అమ్మ ఇస్తున్న ప్రసాదం తీసుకోక తప్పదు. ఆ ప్రసాదం నా నోట్లో వేసుకుంటూ అమ్మ నోటికి నేను అందిస్తున్నట్లు అనుకొన్నాను. (అమ్మ కు నేను తినిపిస్తున్నట్లు భావించాను.అలా 35 రోజులు గదిచినవి. నా భావన గాని- నా మధన గాని అమ్మ కు ఎన్నడు చెప్పలేదు .
ప్రతి రోజూ అమ్మ ప్రసాదంగా పండ్లు కాయలు ముక్కలగా చేసి తన స్వహస్తాలతో పెట్టుతూనే ఉన్నది. నేను నా భావనతోనే తింటూ ఉండేవాడిని. నానాటికి నాలో ఆ మాత్రపు ఆహారం (ప్రసాదం) తీసుకొనే శక్తి కూడా తగ్గుతున్నది.. ఒక నాడు అమ్మ ప్రసాదం పెట్టింది. అది తినగా మరల కాస్త పెట్టబోగా ఇక తినలేనమ్మా! అన్నాను. అమ్మ నావైపు చూసి మందహాసం చేసి తిరిగి దోసిట్లో ప్రసాదం ఉంచుతూ అనురాగంతో వీపు నిమిరి " నీవు తినటం లేదుగా నాన్నా! అని క్షణం ఆగి నా కన్నులలోకి చూస్తూ " నేను తింటున్నానని నీవు అనుకుంటూ... నోట్లో వేసుకొంటున్నావు అట్లాగే అవి కూడా తిను. నాన్నా!" అని అన్నది.
ఇది నా సందేహ నివృత్తి- ఎలాగంటే- నేను అమ్మ వద్దకు రాకమునుపు నుండి , వచ్చిన తరువాత అమ్మ నాకు సాంఘిక ఆర్ధిక సాంసారిక ప్రాపంచిక మానసికమైన ఎన్నో ఎన్నో అనుభవాలు అనుభూతులు ప్రసాదించినప్పటికి ఎప్పటికప్పుడు ప్రతిఅనుభూతిలో ఏదో ఒక ప్రత్యేకత ప్రతిసారి నాకు వచ్చే సందేహాలకు జవాబులే. నేను అమ్మను దైవంగా భావన చేస్తూ, భావనతోనే ఆరాదిస్తూ , అది తనకు అందుతుందాలేదా అనే అనుమానం నాకు కలగకుండా, కలిగినా నివృత్తి చేయటానికి అన్నట్లుగా ఈ ప్రసాదం , ఈ భావన యిచ్చి అన్నీ నాకు నీ భావన మాత్రం గానే నాకు చెందుతాయి నాన్నా! అని మరొకసారి సోదాహరణంగా విశదపరించింది.
ప్రతిదినము అమ్మకు పూజచేసుకునేటప్పుడు ప్రతి నామం లో నామానికి అనుగుణంగా అమ్మను భావన చేసుకుంటూ వుంటాను. కాని భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమ : " అనే నామం వచ్చినప్పుడు మాత్రమూ ఈ చేసే పూజ పెట్టే నివేదన అమ్మ అందుకుంటూన్నదా! అనే జిజ్ఞాస అప్పుడిప్పుడు మనస్సులో ఉదయిస్తుండేది.అది కలిగిన రోజున పూజ అనంతరం పెట్టిన నివేదనలోని పదార్థములు అమ్మ ఒక్కొక్కటి తింటున్నది అని భావన చేసినప్పుడు ఆ పదార్థము యొక్క వాసన మాత్రం ముక్కుకు అందుతూ రుచి ప్రకారం అమ్మ ముఖ కవళికలు మారుతున్నట్లు , అందులో ఏయే పాళ్ళు ఎక్కువ అయినవో తక్కువ అయినవో మనస్సుకు స్పురిస్తూ ఉండేవి. మేము ఆ పదార్థము తినేటప్పుడు అవి ఆ భావనలను ఋజువు పరిచేవి. అదికూడా నా భావనఏమోను లేక నా మానసిక ప్రాభల్యం ఏమోనని అనిపిస్తూఉండేది. అందుకేనేమో ఈ నా నియమం, ఉల్లంఘన, అమ్మ ప్రసాదం. నా భావన అభావనకు భావనామాత్ర సంతుష్ట హృదయ” యైన అమ్మ శరీరం నుండి వచ్చిన అమృత వాక్కు మనసుకు స్పురిస్తున్నా తన నోటితో చెప్పితేనేగాని మనకు ఋజువు. అందుకే నాకు ఈ అనుభవము. అవును! అమ్మ తను అమ్మనని ఈ సర్వజీవరాశికి తల్లినని, తన నోటితో చెప్పిన నమ్మలేని స్థితి ఈ మనస్సుది. అందుకే అడుగడుగునా ఈ అనుభవాలు అనుభూతులు . ఈ సంకోచపు మనస్సుకు అమ్మ యింకా ఎన్ని అనుభూతులు అనుభవాలు యివ్వాలో? పరిపూర్ణమైన మానసిక పరిపక్వతకు వేచి ఉండటమేగా చేయగలిగిన పని.
కొన్ని కాయలు పండటానికి తక్కువ కాలము పడుతుంది. మరి కొన్నింటికి ఎక్కువ కాలం పడుతుంది. ఈ కాయ పండటానికి యింకా ఎంత కాలము కావాలో ? దీనికి జవాబు చెప్పగలిగేది పండించగలిగేది --అమ్మే!