అమ్మ చాలా సార్లు కలలో కనబడుతుండేది. ఏ అష్టోత్తరం గానీ సహస్రం గానీ పారాయణం చెయ్యాలంటే ప్రతినామం తో అమ్మ నామం చేస్తాను. లేకపోతే నాకు పూజ సాగదు. 

అమ్మ ఉన్నప్పుడు నేను జిల్లేళ్ళమూడి లో ఉన్నాను. 10వ తరగతి సెలవుల్లో అమ్మ బట్టలు ఉతికేదాన్ని. అమ్మ కృష్ణవేణి అక్కయ్యని పిలిపించి దానికి బట్టలు ఏలా ఉతకాలో నేర్పించు అని చెప్పింది. నేనూ నెల్లూరు నుంచి వచ్చిన స్వర్ణ అనే అమ్మాయీ అమ్మ బట్టలు ఉతికేవాళ్ళం. అప్పుడు అమ్మ నన్ను జిల్లేళ్ళమూడి లో ఉంచేసింది. జేమ్స్ అమ్మ దగ్గర నామానికి తీసుకెళ్ళేవాడు. జేమ్స్ హార్మోనియం వాయిస్తూ ఉంటే, మేం పిల్లలం హయీగా నామం చేసేవాళ్ళం. హరీ కేమినిస్క్సకి అమ్మ భీమ్ అని పేరు పెట్టింది. భీమ్ తెల్లగా లావుగా ఉండేవాడు. వాళ్ళ చెల్లలు అచ్చు నాలాగే ఉండేదట. ఒకసారి ఫోటో చూపించాడు. ఆ అమ్మాయి అచ్చు నాలాగే ఉంది. మేమంతా భీంతో ఆడుకోనేవాళ్ళం. వేసవికాలంలో భీమ్ దగ్గరికి వెళ్లి "అన్నయ్యా! కొబ్బరి బొండాలు కొట్టియియ్యవా? అని అడిగితే కొబ్బరి బొండాలు దింపి ఉట్టి చేతులోతో కొట్టి ఇచ్చేవాడు. జేమ్స్ నన్ను " భగవతి అక్కయ్య" అని పిలిస్తే మేమంతా నవ్వు కొనేవాళ్ళము.( ఎందుకంటే , అప్పుడు నేను చిన్నపిల్లను గదా! ) 

 

వసుందర అక్కయ్య నన్ను "అమ్మ దగ్గర కూర్చో" అనేది. నాకు భయం. అమ్మ గురక పెట్టి నిద్రపోయేది. నాకూ నిద్ర వచ్చేదీ. అమ్మ ఎంతో ప్రేమతో చూసేది. తినటానికి రోజూ ఏదో ఒకటి పెడుతూ ఉండేది. నేను 10 వ తరగతి పరీక్షలు వ్రాసి అమ్మ ఉన్నాను. మా నాన్న గారికి నన్ను కాలేజీ లో చేర్పించటం ఇష్టం లేదు. అమ్మను అడిగారంట! "అది తప్పేలా చేయమని" నాకు తెలియదు. అమ్మ గది బయట కూర్చోని ఉండగా గుంటూరు నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ గబా గబా గదిలో నుంచి పరిగెడుతున్నట్లుగా వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుంది. నాకేమీ అర్థం కాలేదు. అమ్మ మాటలు వినబడుతున్నాయి. "ఇంగ్లీష్ లో రెండు మార్కులలో పోయింది, మళ్లీ రాస్తే పాస్ అవుతావని." అని. ఈ లోపల ఏవరో ఫోన్ ఎత్తారు. "భగవతి రిజల్టు వచ్చింది. పరీక్ష పోయింది." అని. తరువాత చూస్తే తెలిసింది. ఇంగ్లీష్ లో 2 మార్కులలో పరీక్షపోయిందని అమ్మ అన్నట్లుగానే జరిగింది. మళ్లీ రాస్తే 70 శాతం వచ్చింది. నేను కొన్ని ఆశ్రామాలకి వెళ్ళాను. శ్రీశైలం, బెంగుళూరు. ఎక్కడికి వెళ్ళినా అమ్మ దగ్గర ఉన్న అనుబంధం ఎక్కడ నాకు కనిపించలేదు. ఈ అమ్మతో కూడిన కుటుంబం ఎంతో గొప్పది.  

 

1981 లో అమ్మ నా వివాహం చేసింది. ఆయన చాలా కోపిష్టి. అమ్మ నాకు ముందే చెప్పింది. "వాడికి ఎప్పుడైనా కోపం వస్తే నువ్వేమీ మాట్లాడకు. రెండు నిమిషాలలో వాడి కోపం దానంతటదే పోతుంది." అని. అమ్మ చెప్పినట్లే ఆయనికి యప్పుడు కోపం వచ్చిన తాటాకుమంటలా వెంటనే తగ్గిపోయేది.  

 

నేను జిల్లేళ్లమూడి లో 10 నెలలు వివాహం తరువాత ఉన్నాను. రోజూ 11 సార్లు ఖడ్గమాల చదివేదాన్ని. అమ్మ భలే మెచ్చుకోనేది. అది 11 సార్లు ఖడ్గమాల చదువుతుందని అందరితో చెప్పేది. అమ్మ ఒక సారి నన్ను పిలిచి చెప్పింది. " నీ పూజల వేడి అంతా ఎక్కడికి పోతుంది. వంటింటిలొకి వెళ్ళి హనుమానుబాబు ని అడిగి అన్నం తెచ్చుకో! పెరుగు కలిపి నివేదన పెట్టి ఆ అన్నం తిను. " అని. నేనట్లాగే చేసేదాన్ని. నన్ను మా ఆయన్నీ హైమాలయమ్ వంటశాల లో తినమనేది. మేము ఎక్కువగా అక్కడే భోజనం చేసేవాళ్ళము. ఫారీనర్సును చాలామందిని మా పోర్షన్ కి పంపించేది. మా ఇంట్లో చల్లగా ఉంటుంది అని. మేము అందరికి చిక్కటి పెరుగు వేసి అన్నం పెట్టేవాళ్ళము. వాళ్ళు చాలా ఇస్టం గా తినేవాళ్ళు.  

 

1982 లో హైదరాబాదు కి బదిలీ కావటంతో హైదరాబాద్ కి మారాం. ఆయనోక్కడే జిల్లేళ్లమూడి కి వెళ్ళేవారు. తరువాత అమ్మ చెప్పింది. "దాన్ని కూడా తీసుకుని రా" అని. అప్పటినుంచి ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆ రోజులు ఎంతో అపురూపం! కోమరవోలు సరోజినీ అక్కయ్య(వాళ్ళ పిల్లలు) కుసుమ అక్కయ్య, భీమ్, టెర్రీ, జేమ్స్ ,నేనూ అందరం కలసి మధ్యాన్నం పూట అమ్మ నామం చేసేవాళ్ళం.  

 

ఆ రోజుల్లో జిల్లేళ్లమూడి లో ఒకటే ధ్యాస, అమ్మ పని, అమ్మ నామం జిల్లేళ్లమూడి పాత రోజుల్ని చూస్తామా , ఎప్పటికైనా?

Author: 
వారణాసి భగవతి