1960 సం. ఏప్రిల్ నెలలో అమ్మ పుట్టినరోజు 'మన్నావ' గ్రామం లో జరిగింది. నేను మా అమ్మ, తమ్ముళ్ళు ఒక రోజు ముందుగానే 'మన్నావకు' చేరుకున్నాము. ఆదే సమయం లో అమ్మ కూడా జిల్లేళ్లమూడి నుంచి అక్కడికి వచ్చింది. ఆ రాత్రి అమ్మ కుర్చీమీద కూర్చుందీ. అమ్మను మేము ఒక ప్రక్క నిలబడి చూస్తున్నాము. రకరకాలుగా అనేక అవతారలతో కనిపిస్తున్నది. అంత జనం మధ్య నుండి కూడా మమ్మల్ని భోజనం చేసిరమ్మని సంజ్ఞ చేసింది. అప్పటికీ రాత్రి ఎనిమిదిన్నర గంటలైంది. నన్ను ఎప్పుడు చూసినా అన్నం తినమని చెబుతుంది. మేము భోజనాలకు వెళ్ళాము. భోజనం అయిందనిపించుకొని మేము వస్తుంటే దారిలో చెవులు దిబ్బళ్ళు పడి స్పృహ తప్పిపడిపోయాను. మళ్లీ చెవుల్లోకి ప్రాణం వచ్చినట్లైంది. లేచి అమ్మ దగ్గరుకు వచ్చాను. అప్పటికే అమ్మను కారులో ఊరేగింపు మొదలు పెట్టారు. నేను కొంత దూరం కారుతో బాటు వెళ్ళి మళ్లీ వెనక్కు వచ్చాను. అమ్మ ఊరేగింపు అయ్యేటప్పటికి తెల్లవారు జాము 3 గంటలు కావస్తున్నది. నా పొట్ట నొప్పి ఎక్కువుగా ఉన్నందున నేను నిద్ర పోకుండా అమ్మ వచ్చేవరుకు వేచి ఉన్నాను.
అమ్మ వచ్చి స్టేజ్ మీద మంచం వేస్తే అక్కడ పడుకుంది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా! అన్నాను. అమ్మ ఏమిటన్నుట్లుగా చూచింది. అమ్మా! పొట్ట నరాలు బిగపట్టినట్లుగా ఉన్నది. అని అన్నాను. గుండెల్లో నొప్పా? అన్నది. మళ్లీ నేను మొదటిసారి చెప్పిందే చెప్పాను. అమ్మ అప్పుడు "నేను జ్వరం లో ఉన్నా ఊరంతా తిప్పారు. మరి నాకెంత బాధ" అంటూ అని నవ్వింది. నిలబడలేని నేను అమ్మను చూస్తూ పకపక నవ్వుతుంటే ప్రక్కన నిలబడి ఉన్నవాళ్ళు దిగ్భ్రాంతి చెందారు. మా అమ్మ కూడా అలాగే నిలబడిపొియింది . "చూడు! మీ అమ్మ నీవు ఎక్కడ చచ్చిపోతావోనని భయపడుతుంది" అని అమ్మ అంది. అమ్మను అలాగే చూస్తున్నాను. అమ్మ కూడా నన్ను చిరునవ్వుతో చూస్తున్నది. ఆ చిరునవ్వు జగములన్ని సమ్మోహనపరిచేదిగా ఉంది. నాకేమో నవ్వు ఆగటము లేదు. అమ్మ "నీవు నా దగ్గర పడుకోవాలన్న ఎత్తుగడతో వచ్చావు. రేపు పడుకుందుఉలే! హైమ డాక్టర్గారి ఇంట్లో పడుకుంది.. నీవు కూడా అక్కడికి వెళ్ళి మందు వేసుకొని పడుకో." అన్నది. నేను 'సరే!' అని ఇవతలకు వచ్చాను. డాక్టర్ గారి ఇంటికి వెళుతుంటే నొప్పి ఎక్కువై "అమ్మా!" అంటూ పడిపోయాను. కామేశ్వరమ్మ అమ్మమ్మ నన్ను ఒక మంచం మీద పడుకోబెట్టింది. మా అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చి నా దగ్గర కూర్చున్నది. నేను " అమ్మ నన్ను తీసికెళ్ళు" అంటూ కలవరించసాగాను. నన్ను చూచి భయపడుతున్న మా అమ్మకు అమ్మమ్మ దైర్యం చెప్పి, నాతో "అమ్మ దగ్గర పడుకుంటావా?" అని అడిగింది. అమ్మకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాను. అమ్మమ్మ డాక్టర్ గారి ఇంటికి తీసుకొని వెళ్ళింది.(ఆమెకు అమ్మ డాక్టర్ గారి ఇంటికేళ్ళమన్న విషయం తెలియదు, నాకు డాక్టర్ గారి ఇల్లు తెలియదు. అమ్మ నన్ను ఆ విధంగా ఆదుకుంది.). అమ్మ లేనియెడల నేను ఆరోజు అమ్మలో లీనమయ్యేదానిని. డాక్టర్గారు మందిచ్చారు. నేను హైమ ప్రక్కన పడుకొన్నాను. తరువాత నాకు ఒళ్ళు తెలియని నిద్ర. అరగంట తరువాత మా అమ్మ వచ్చి నిద్రలేపింది. "నొప్పి తగ్గిందా?" అని అడిగింది. నొప్పి మటుమాయమైంది. "నొప్పి లేదని" మా అమ్మతో చెప్పాను. ఒళ్ళు చాలా తేలికగా హాయిగా ఉంది. కనుచీకటిగా ఉన్నా, అమ్మకి దణ్ణం పెట్టుకోవాలని వెదుకుతూ వెళ్ళాం. అమ్మ స్టేజ్ మీద లేదు. తను ఎక్కడ పుట్టిందో అక్కడే మంచం వేసుకొని పడుకొని ఉంది. అమ్మకు దణ్ణం పెట్టుకోగానే అమ్మ బాధగా "తాకవాకమ్మ" అంది." లేదమ్మ నేను గట్టిగా నొక్క లేదు." అన్నాను.
ఆరోజు శుక్రవారం. అమ్మ పుట్టిన రోజు. పుట్టినరోజునాడు అమ్మ తలంటుకొనేముందు చీరాల డాక్టర్ అమ్మ తలకి నూనె పెడతారు. అమ్మ స్నానం చేసి స్టేజ్ మీదకు వచ్చి కుర్చీలో ఆసినురాలైంది. జనం సందోహం చాలా ఎక్కువుగా ఉంది. అమ్మ కళ్ళకు బిడ్దలందరిని చూసిన ఆనందం కనిపిస్తుంది. అప్పటి వరకు ఆమె పడిన బాధ మచ్చుకైనా లేదు. పూజ చాలాసేపు జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలై 4 గంటల వరకు జరిగింది. పూజ మధ్యలో నన్ను భోజనం చేసిరమ్మని సంజ్ఞ చేసింది. ప్రతిక్షణమ్ అమ్మ తన కరుణ చూపిస్తూనే ఉన్నది. అదే దైవలక్షణం. నన్నే కాదు. ప్రతివాళ్లని అంతే.
సాయంత్రం 5,6 గంటలు మధ్యలో అమ్మను వాళ్ళ అన్నయ్య రాఘవయ్య గారు వచ్చి వారి ఇంటికి తీసుకెళ్లారు. అమ్మను కుర్చీలో కూర్చోబెట్టి ఆ దంపతులు పూజ చేసుకున్నారు. తరువాత అమ్మకు పుట్టింటి పసుపు కుంకుమ చీరేసారే పెట్టి కారులో స్టేజ్ దగ్గరకు తెచ్చారు. అమ్మ స్టేజ్ మీద ఉన్న సింహాసనం మీద ఆదిష్టించింది. అమ్మను చూడటానికి ఉదయం కంటే సాయంత్రమే ఎక్కువగా వచ్చారు. పూజ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను అమ్మనే చూస్తున్నాను. అమ్మ మొదట రోజారంగు చీరే కట్టుకుని ముక్కుకు బులాకీ పెట్టుకొని అరమోడ్పు కన్నులతో పక్కకు కూర్చొని తలక్రింద చెయ్యి పెట్టుకొని ఉంటే పాలకడలిలో లక్ష్మీలాగ కన్పించసాగింది. ఆ రూపం ఎంత చూసిన తనివితీరటం లేదు. పూజ కాగానే అమ్మకు కిరీటం పెట్టారు. ఆ రూపం మాటల వర్ణనకు సాధ్యం కాదు. అమ్మకు నివేదన తరువాత , వచ్చిన వారంతా అమ్మకు చీరెలు పెడుతున్నారు. అమ్మకు చీరే పెట్టటం అమ్మ చీరే మార్చుకొని రావటం వెంటనే హారతి ఇవ్వటం ఇలా జరుగుతున్నది. చివరికి ఒకేసారి 12 చీరెలు కట్టుకొని వచ్చింది. తరువాత ఆశ్చర్యంతో అమ్మను అడిగాను " అమ్మా, నీవు ఒకేసారి ఎలా 12 చీరెలు కట్టావా? ఎలా సాద్యమైంది? ఒకే చీరెను కట్టుకున్నట్లుగా అనిపించింది. అమ్మ చిరు నవ్వు నవ్వింది. ప్రతి ఆదివారం జిల్లేళ్లమూడికి వెళ్లేవాళ్ళము. నేను ఇంట్లో ఏం చేసేనో చెప్పేది. ప్రతిక్షణం మమ్మల్ని గమనిస్తూనే ఉండేది. నేను కాళ్ళ దగ్గర ఆయన తల దగ్గర కూర్చొని అమ్మ చెప్పే మాటలు వింటుంటేవాళ్ళము. మళ్లీ ఆదివారం ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తుండేవాళ్ళం.