"అంఆ" అంటే అంతులేనిది, అడ్దులేనిది. "అంఆ" అంటే సర్వ రక్షణకు ఆధారం. మొట్ట మొదటి సారిగా అమ్మను చూచింది 1959వ సంవత్సరం డిసెంబర్ నెల ముక్కోటి నాడు. భగవంతుని చూడాలని చిన్నతనం నుంచి అనుకునేదాన్నీ. నా రాముడే నా మొర ఆలంకించి అమ్మగా పుట్టి నన్ను ఆదరించాడు. ఆ కళ్ళల్లో దయ కరుణ కలిగి చిరునవ్వుతో అమ్మ నాకు ఒక దైవంగా కంపించింది. అమ్మ గురించి అసలు నాకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు?

 

1959 వ సంవత్సరం జూన్ నెల 25 వ తేదీ మా ఆమ్మా లలితాంబ తన స్వగ్రామము చీమలమర్రికి వెళ్ళింది. రోజూ పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని అప్పుడు భోజనం చేసేది. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మాణుడు భోజనం సమయానికి తలుపు తట్టాడు. అమ్మా! నేను ఈ వూరు పని మీద వచ్చాను. భోజనం చేధ్ద్దామంటే బ్రాహ్మణుల ఇళ్ళు అక్కడ లేక ఇక్కడకు వచ్చాను. అని అన్నాడు. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ఆయన స్నానం చేసి దేవుడి మందిరంలో ఉన్న దేవుళ్లని చూసి ఎన్నో దేవాలయాలు చూశాను. కానీ, జిల్లేళ్లమూడి లో ఉన్న అమ్మ ఉన్నట్లు ఏ దేవుడు కనిపించలేదు. అక్కడ స్వయంగా అమ్మకు పాలతో నీళ్ళతో అభిషేకం చేస్తారు. నీవు తప్పకుండా వెళ్ళిరా! అని చెప్పాడు. అడ్రెస్ కూడా ఇచ్చాడు. భోజనంచేసి 'వెళ్ళివస్తానని' చెప్పి వెళ్ళిపోయాడు. తలుపు వేసి కిటికీలో నుంచి చూస్తే ఆ బ్రాహ్మాణుడు కనిపించలేదు. ఎటు చూసిన ఖాళీ మైదానము. ఆమెకు చాలా ఆశ్చర్యము వేసింది. మరునాడు నర్సరావుపేటకు వెళ్ళి మావాళ్ళందరిని పిలిచి జరిగిన సంగతులు చెప్పింది. తరువాత పొలంపని మీద కర్లపాలెం వెళ్తూ, జిల్లేళ్లమూడికి కూడా వెళ్ళింది. అమ్మ ఆమెను ఆదరించి కుశలప్రశ్నలు వేసి నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరు చెప్పారు అని అడిగింది. ఆమె జరిగిన అంతా చెప్పింది. అప్పుడు అమ్మ " ఆ బ్రాహ్మాణుడు మళ్లీ కనిపించాడా?" అని అడిగింది. మా ఆమ్మ కు ఏమీ అర్ధం కాలేదు. భోజనం చేసి తిరిగి వెళ్లుతుంటే దారిలో అప్పుడు అర్ధమైంది. అమ్మే బ్రాహ్మణ రూపంలో వచ్చింద్దని. తరువాత మా ఆమ్మకు అమ్మ కలలో కనిపిస్తే రెండోసారి కూడా వెళ్తూతుంటే, నేనుకూడా వస్తానంటే, 'మీ భార్యాభర్తలు కలసి వెళ్ళిరండి.' అని చెప్పింది. వార్ని అడిగితే 'నాకు కుదరదు. నీవు రామమూర్తి (మా మరిది) కలసి వెళ్ళిరండి.' అని చెప్పారు.

 

మేము ముక్కోటి ఏకాదశి నాడు ఆ విధంగా అమ్మను మొట్టమొదటిసారిగా దర్శించుకొన్నాము. జిల్లేళ్లమూడి లో పందిళ్లు వేస్తున్నారు. అమ్మ తలస్నానము చేసి మందిరం క్రింద రేకు తొట్టి పెట్టి బల్ల వేశారు. అమ్మను అక్కడ కూర్చో పెట్టి పాలాభికషేకం చేశారు. పాలతో తల స్నానం ఆ సంవత్సరము వరకే. (మరుసటి సంవత్సరము నుంచి పాలతో పాదాభిషేకం మాత్రమే చేశారు.) అప్పుడు అమ్మను చూసి నాకు ఈమె మామూలు అమ్మ కాదు, మనకోసం వచ్చిన జగజ్జనని అనిపించింది. అమ్మ కూర్చొని దర్శనం ఇచ్చిన ఆ తాటుకుల మందిరమే ఇప్పుడు హైమా ఉన్న దేవాలయము. అమ్మ జుట్టు మోకాళ్ళు దాటి ఉండేది.(పటములో ఉన్న లక్ష్మీదేవికి ఉన్నట్లే ఉండేది). అమ్మకు పాలతో అభిషేకము చేసిన కొబ్బరిమట్టలతో ఉన్న పాకయే ఇప్పుడున్న మంటపము. ఇప్పుడు ఇక్కడ అనేక అనసూయ వ్రతాలు హైమా అఖండ నామం సంధ్యా వందనము లలితసహస్ర నామాలు మరియు కోటి నామార్చన వగైరా జరుగుచున్నవి.

Author: 
రాచర్ల కమల