సర్వ శివంకరమైన, సుందరమైన అమ్మ దర్శనం మనోజ్ఞము, ఆనందదాయకమే గాదు అదృష్టఫలం కూడా. 

 

'నేను నిన్ను చాలాకాలంగా చూడాలని అనుకున్నాను, ఇన్నాళ్ళుగా రాలేక పోయాను' అంటే.

 

"రావాలని అని నువ్వు అనుకున్నావు, కాని నేను అనుకోలేదుగా" - అన్నారు అమ్మ.

 

అమ్మ దర్శనం చేసికోవటం కోసం మన ప్రయత్నమేమీ అవసరం లేదు – నిష్ప్రయోజనం అన్నమాట.

 

అందుకే ఒక సందర్భంలో అమ్మ---- “నేను కనబడితే మీరు చూస్తారు, మీరు చూస్తే నేను కనబడను" అన్నారు.

 

అమ్మను చూడటం ఎలా? అంటే- మన దృక్పథం ఎలాఉండాలి, మన భావన ఏవిధంగా ఉండాలి అని.

 

జిల్లెళ్ళమూడిలో 10-11-1979 తేది ఉదయం హైమవతీ జయంత్యుత్సవ సందర్భంగా ‘లక్ష్మీనారాయణ అన్నయ్య’ సంకల్పానికి అమ్మ రూప కల్పన చేసి ‘శ్రీలలితాకోటినామార్చన’ పవిత్ర వాతావరణంలో జరిపించిన రోజు నాటి వేదికపై అమ్మను చూసిన వారందరికీ తను యెంత ఆరోగ్యంగా ఉన్నదని తెలుసు. అయినా నాటి మహాయజ్ఞాన్ని అమ్మ స్వయంగా మొదటి నుండి చివరి వరకూ నడిపింది. 11-11-79 తేది ఉదయం,అమ్మ దర్శన సమయం , అమ్మ వదన మండలం ఎప్పటి వలెనే ఏ భావానికి చోటులేక నిర్లిప్తంగా కొంత సేపు సాక్షి మాత్రంగా అన్నట్లు కొంత సేపు, అన్నింటినీ వింటూ కొంతసేపూ, కన్నులు మూసికొని ఎదుటి వ్యక్తిత్వంతో తాదాత్మ్యం చెంది వాళ్ళ బాధని తనదిగా అనుభవిస్తూ కొంతసేపు, వెళ్ళివస్తానమ్మ అని అంటే యెదలో ఉప్పొంగి పొరలే మమతా ప్రవాహ వేగంతో, సార్ద్ర నయనయై కొంతసేపూ, మళ్ళీ ఎప్పటికి వస్తానో..... ఏ నాటికీ మళ్ళీ అమ్మ దర్శనం అనే హృదయాల్ని పలకరిస్తూ తన అనురాగపు పొత్తిళ్ళలో పొదివి పట్టుకుంటూ మూర్తీభవించిన అతిలోక నిరుపమాన మాతృత్వం అయింది. కాకినాడ, హైదరాబాదు, రాజమండ్రి , నెల్లూరు వరంగల్లు, ఇంకా అనేక చోట్ల నుండి వచ్చిన సోదరీ సోదరులు ఒక్కొక్కరే అమ్మ పాదాలకు అభివందనం చేసి ప్రసాదం తీసికొని వెడుతున్నారు. శెలవు తీసికొని వెడుతున్నవారి నొసట అమ్మ పావన మృదు కరాలు కుంకుమ తిలకం దిద్దటం లేదు. నేను వెళ్ళి అమ్మకు అభినందనం చేసి వెళ్లోస్తానమ్మ అంటే అన్నయ్య అమ్మ ప్రసాదాన్నీ నా చేతిలో ఉంచాడు. బొట్టుపెట్టమని అమ్మ కేసీ చూసాను. ఆ చేతులు నా నొసట కుంకుమ దిద్దటానికి నిరాకరించాయి. అది నిరాదరణ కాదు. నిస్సహాయత, అమ్మ అస్వస్థత. 'ఈ సారికి నువ్వుపెట్టుకో అన్నయ్య కంఠం ధ్వనించింది. యదార్ధంగా అమ్మ అనుగ్రహ ప్రసారం ప్రేరణ ద్వారా , చెరా చెర భేదారహితంగా సకల సృష్టిని కన్న తల్లి అమ్మ.

 

" నే నుండి నువ్వు లేకపోతే ఆ బాధ భరించలేను". అనే అమ్మ హృదయం ఆత్మీయత కు నిలయం. మమతకు ఆలయం.

 

కులమత వర్ణ వర్గ విభేదా రహితంగా ఆదరణని ఆప్యాయతని పంచి ఇచ్చే అమ్మ మమతా స్రవంతియే కాని మరొకటి కాదు.

 

వరదాయిని కాని మరొకటి కాదు .ఇవ్వటమే కాని మరొకటి తెలియదు.

 

ఇట్టి అమ్మను భగవంతునిగా భావన చేశామనుకోండి, శుభా శుభాలు.... కష్ట సుఖాలు రెండూ వాని అనుగ్రహ సంజనితమే అని అనుకోగలిగినవాడు ఏ ఇబ్బంది ఉండదు.

 

Author: 
శ్రీమతి రాధ
Source: 
మాతృశ్రీ మాస పత్రిక - సంపుటి 15 - సంచిక 3 - మే 1980