ఆ రోజుల్లో అమ్మ వంట చేసి వడ్డన చేస్తుండేది. ఒక రోజు నేను ప్రత్యక్షంగా దర్శించిన సన్నివేశం వివరిస్తాను;

 

ఇంట్లో పదిమంది పైనే బయట నుండి వచ్చిన వారున్నారు ‘భోజనానికి.’ అమ్మ కాఫీ కప్పుతో బియ్యం కడిగి ఎసరు లో పోసింది. " నాకొక్కడికే చాలదు ఆ అన్నం ఇంత మందికేట్లా పెడతావమ్మా?" అని అడిగాను. అమ్మ "నీకు కావలసినంత నీవు తిను- సరిపోవటం సంగతి నేను చూసుకుంటాగా!" అన్నది. నేను కడుపు నిండా తినటమే కాదు; ఆ పదిమంది తృప్తిగా భోంచేశారు . ఆ కాఫీ కప్పుతో పెట్టిన బియ్యం ఇంతమందికి యెట్లా సరిపోయిందో ఆశ్చర్యమేసింది.

 

ఒక దసరాలో బామ్మ అమ్మ చేత కలశం పెట్టించి పూజలు చేయించింది. అమ్మ రాజరాజేశ్వరీ అష్టకం చదువుతున్నప్పుడు నేను విన్నాను. అమ్మ కంఠం లోని మాధుర్యాన్ని అనుభవించాల్సిందే కాని మాటలలో చెప్పలేము. ఆ రోజుల్లో రాజు బావ మంత్రం పుష్పం చదివేవాడు.

 

మా లోకనాథం బాబాయి అప్పికట్లలో ఉండేవాడు. మేము అప్పికట్లలో చడువుకుండేవాళ్ళం. అమ్మ అప్పికట్లకు బయలుదేరింది. నేను కూడా అమ్మ వెంట ఉన్నాను. రెడ్డి సుబ్బయ్య కూడా మా వెంట వచ్చాడు. పంట కాలువ దాటాలి- అమ్మతో "నేనెత్తుకొని దాటిస్తాలే అమ్మా!" అని అమ్మను ఎత్తుకోవటానికి ప్రయత్నించాడు . అతని వల్ల కాలేదు- అమ్మను ఎత్తటం. "ఏమిటమ్మ? నిన్నెత్తటం ఎంతలే అనుకున్నాను. ఇంత బరువెక్కావేంటి? నేనెత్తలేక పోతున్నాను. " అని అమ్మను అడిగితే "తేలిగ్గానే ఎత్తుకొని దాటిస్తానన్నావుగా?" అని నవ్వి " ఇపుడు ప్రయత్నించు" అన్నది. ఈ సారి సుబ్బయ్య ఎత్తుకుంటే బెండు కన్నా తేలికగా, అవలీలగా ఎత్తుకొని దాటించాడు. అణిమా గరిమా లఘిమా వంటి అష్టసిద్ధులు అమ్మకు వశమై ఉండవచ్చు అని అనిపించింది.

 

ఆ రోజుల్లో అమ్మ ప్రసాదంగా అందరికీ పుట్టమట్టి పెట్టేది. అది ఎంతో సువాసనలతో మధురంగా రుచి కలిగి ఉండేది. కొమ్మూరు డాక్టర్ సీతారాం గారి ఇంట్లో మూల ఎలుక చచ్చిన వాసన వచ్చింది. వాళ్ళంతా అమ్మ వచ్చింది - అన్నారు. ఈ వాసన వస్తే అమ్మ రావటేమిటి? అని ఆశ్చర్య పోయాను. ఇంకొంతసేపటికి కసువూడ్చి పోసే నెయ్యి గుంట దగ్గర సువాసనలు వచ్చాయి. అప్పుడూ అమ్మ వచ్చిందన్నారు. అమ్మ ఆ రకంగా తన రాకను గూర్చిన ఒక సూచన ఇస్తున్నట్లు ఆ రోజుల్లో నిదర్శనాలు ఉన్నాయి.

 

ఎవరన్నా బిచ్చగాడిని కసిరి "ఫో" అంటే అమ్మ ఆ ప్రస్తావన మా వద్దకు తెచ్చేది - తన దగ్గరికి మేము వెళ్ళినప్పుడు. అందుకని బిచ్చగాళ్ళను కసరటం, పోమ్మనటం సామాన్యంగా చేయం. అమ్మ ఏరూపంలో వస్తున్నదో తెలుసుకోలేక!

 

జిల్లెళ్ళమూడి మా పాకలో వెలుతురు కిరణాలు పడుతుండేవి. తాటాకులు లేచిపోయి వెలుగు కిరణాలు పడుతున్నాయేమోనని నాన్నగారు దట్టంగా పాకను కప్పించారు. అయిన కిరణాలు పడుతూనే ఉన్నాయి. ఎక్కడి నుండి అని పరీక్షగా చూస్తే పగిలిపోయిన జాడీలో నుండి ఆ కాంతి కిరణాలు వస్తున్నాయి. అందులో నాగేంద్రుడు ఉన్నాడని అందరూ ఆ తర్వాత గుర్తించారు. అది తర్వాత శ్యామల వద్దకు వెళ్ళిందని, పండరీ పూర్ వెళ్ళిందని చెప్పుకున్నారు.

 

1956 లో అమ్మ సమాధి స్థితికి వెళ్ళిపోయింది. రెండు-మూడు రోజులు లేవలేదు. జబ్బు అనుకోని చికిత్స చేశారు. ఆఖరికి చనిపోయిందని భావించారు. చివరకు తనంతట తనే నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచింది. యోగానుభూతులు యోగ సిద్ధులు చుట్టూ వున్నవారికి తెలియక పోవటం వల్ల యెంతో హడావుడి జరిగింది.

 

నేను అమ్మ చేతి మీద నా తల పెట్టి పడుకొని నిద్ర పోయే వాడిని. కొంతసేపటికి చూస్తే అమ్మ కనిపించేది కాదు. అదృశ్యమయ్యేది . బాపట్లకు వెళ్ళి వచ్చేదట. తెల్లవారేటప్పటికి మళ్ళీ నా ప్రక్కనే. నా తల అమ్మ చేయ్యిమీదే వుండేది. అమ్మ ఈలా ఇక్కడ నుండి అక్కడకు- అక్కడి నుండి యిక్కడకు ఒక్కొక్కసారి రెండు ప్రదేశాల్లోనూ ఉన్న సంఘటనలున్నాయి. చిన్నప్పుడు అమ్మను వదలి ఉండలేని స్థితి ఉండేది.

 

అమ్మ నుండి దూరంగా ఉన్నా, అమ్మ మమ్మలిని ప్రతిక్షణం చూస్తూనే ఉన్నది అనేందుకు- ఎన్నోసార్లు మనం ఎక్కడో మాట్లాడుకున్న సంభాషణలు యథాతధంగా తన వద్దకు వెళ్ళినప్పుడు చెప్పేది.

 

నాది సామాన్యమైన విద్య. ఆ విద్యతో జీవితంలో స్థిరపడటం చాల కష్టం. అమ్మ ప్రమేయం జీవితంలో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ఆఖరికి మా అబ్బాయి ఎస్ ఎస్ యల్ సి కూడా తప్పాడమ్మా! చెప్పుకోవడానికీ సాదా గ్రాడ్యువేట్ అయిన నాకు ఆర్ టి సి లో శేషగిరిరావు అన్నయ్య ఉద్యోగం ఇప్పించినా, పోలిశెట్టి కుమారస్వామి బంధువులు శివరావు గారి ద్వారా స్టేట్ బ్యాంకు లో తాత్కాలిక ఉద్యోగం వచ్చినా అన్ని జిల్లెళ్ళమూడి కరణం గారి కుమారునిగా - నా చదువుతో-- నా ఊహకందని విషయాలు. నా జీవితం నేనుగా జీవించడం లేదు. నా ఆదాయానికి నా ఇంటి ఖర్చుకు సంబంధం లేదు . అంతా అమ్మ ప్రమేయంతోనే జరుగుతున్నదని- అడుగడుగునా ప్రస్ఫుటమౌవుతునేవుంది. ఇది సామాన్య ఉద్యోగికి సాధ్యమయ్యే పని కాదు. భౌతికంగా కూడా అమ్మ వల్లనే నా జీవితం -జీవనం నడుస్తున్నది. అవసరాలన్నీ అమ్మ తీరుస్తున్నది. డబ్బు ఎలా సమకూరుతుందో తెలుస్తున్నా, ఆ రావటం వెనుక అమ్మ అదృశ్యహస్తం వున్నది.

 

ఒకసారి కేశవశర్మ గారు నేను మన్నవ వెళదాం అనుకున్నాం. నేను నా శారీరక పరిస్తితుల దృష్ట్యా -ప్రయాణ సౌలభ్యం దృష్ట్యా చిన్న కారు మీద వెళ్దాం అన్నాను. చిన్న కారు కు అంత ఖర్చు పెట్టటం నా చేత పెట్టించటం ఆయనకు ఇష్టం లేదు. 'ఎందుకు బస్సు మీద వెళ్దాం, ఊళ్ళోకి బస్సులున్నవి కదా!' అన్నాడు. వెళ్ళేటప్పుడు ఫర్వాలేదు, వచ్చేటప్పుడు ఇబ్బంది, పైగా ప్రయాణం మన చేతుల్లో మనం అనుకున్నపుడు ఉండదు అన్నా వినిపించుకోలేదు. బస్సులో వెళ్ళాము మన్నవకు. కానీ అమ్మ మా మనస్సు గ్రహించిందేమో ఎవ్వరమూ అనుకోకుండా పూర్ణచంద్రరావు కారు వేసుకొని తనపని మీద మన్నవకు వచ్చాడు. మమ్మల్ని అందులో ప్రయాణింపచేశాడు. అమ్మ చేసే వసతులు అలా ఉంటాయి. ఇది ఒక ఉదాహరణగా మాత్రమే మీ ముందుంచాను.

 

అమ్మ మనల్ని దగ్గరకు తీసుకున్నంతగా మనం అమ్మ దగ్గరకు పోలేకపోయామేమో! అనిపిస్తుంది. అమ్మ విశ్వజననీత్వాన్ని ఏ నాడు వద్దనుకోలేదు. అది తనూభవులమైన మాకు అడ్డు అని కూడా అనుకోలేదు. అమ్మను దైవంగా చూడాలి- చనువు ఇచ్చింది కదా!- అని తేలికగా చూడరాదనేదే నా సిద్దాంతం మొదటి నుండి. అమ్మే నాకోసం గాయత్రి భవనం ఎదురుగా ఉన్న ఇంటిపై మొదటి అంతస్తు కట్టించింది. క్యూరింగ్ జరుగవలసినన్ని రోజులు పూర్తిగా జరుగలేదు. అమ్మ ఇంటికి వస్తానన్నది. నలుబది రోజులు నా ఇంట్లో ఉన్నది. నన్ను మానసికంగా తన ఎడబాటును తట్టుకొవటానికి తయారు చేసే తతంగం జరిపిందనుకుంటాను. నా చేత రోజూ క్రొత్త బట్టలు పెట్టించుకొని పూజ చేయించుకుంది. ‘ప్రసన్నాంజనేయశర్మ – కుమారశర్మ’ ల చేత రుద్రం చెప్పించి, అభిషేకం స్వయంగా చేసుకొనే అవకాశం ఇచ్చింది.

 

ఆ 40 రోజులూ ఇంట్లో అమ్మకూ అనసూయేశ్వరాలయంలోను పూజలు చేసుకున్నాను. పూర్వం అమ్మ స్నానం చేసిన నీళ్ళు పవిత్రంగా పట్టుకొని స్నానం చేసేవాళ్ళం. ఆ విధంగా మళ్ళీ ఆ 40 రోజులు స్నానం చేసే అవకాశం కల్గింది. అమ్మ స్నానం చేసిన స్నానాల గదిని తర్వాత నా పూజా మందిరంగా చేసుకున్నాను. అమ్మ ఉనికిని నేను అనుభవించేవాడిని. అమ్మ ఆలయంలో ప్రవేశించిన 11 వ రోజున కిరీటము, శూలము చక్రాదులతో దర్శనం ఇచ్చింది. మధు సత్తెనపల్లిలో ఉద్యోగరీత్యా ఉన్న రోజులలో నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను. అప్పుడు నేను మానసికంగా బాగా వత్తిడులలో ఉన్నాను. మేడ మీద నుండి దూకినట్లు అమ్మ తన రెండు చేతులలతో నన్ను పట్టుకున్నట్లు ‘కల’ వచ్చింది. ఆ తర్వాత ఎన్నడూ నేను అంత మానసిక వత్తిడులకు లోను కాలేదు.

 

అమ్మ నా జీవితం నడిపిస్తున్నది. అమ్మ నడిపించినట్లు నడుస్తున్నాను. డాక్టర్ పొట్లూరి సుబ్బారావు గారు అన్నట్లు ‘సర్కస్ కంపెనీ వాడు ఎట్లా ఆడమంటే అందులోని జంతువులు మనుషులు అట్లా ఆడినట్లు’ అమ్మ కంపెనీలో ఆడే ఆట బొమ్మలం మనం. ఏ పాత్ర చేత ఏ పని నిర్దేశించిందో అమ్మ ఇచ్ఛ.

 

అప్పుడప్పుడనిపిస్తుంది- ఏమూలో ఎవరకీ అందుబాటులో లేని చోట బాదరబందీలకు ఆవల ఉంటే బాగుంటుందని. కానీ, అమ్మ ఉండనివ్వదు కదా! ఇది అమ్మ ఇచ్చిన 'శరీరం- జీవితం' అది అమ్మకే అంకితం అయితే అంత కన్నా కావలసినది ఏముంది?

                                                        అంతా అమ్మ దయ

 

Author: 
శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు
Source: 
శ్రీ విశ్వజనని పరిషత్ ప్రచురించిన - బ్రహ్మాండేశ్వరి "అమ్మ" సంపుటి నుండి (22-06-2014)