నిను నే చూచిన వేళ ఓ శుభదినం
నిను నే కొలిచిన వేళ ఓ పర్వదినం ||
నీవెక్కడో ఉన్నావని నే వెతుకుతున్నాను
శబ్ధమై, నిశబ్ధమై నాలోన వినిపిస్తున్నావు
మాతగా విశ్వమాతగా నీవు తిరుగుతున్నావని
శ్వాసగా ఉచ్చ్వాసగా నాలోను తిరుగుతున్నావని ||
నిను కందామని, నినులిందామని నే వెతుకుతున్నాను
పాపగా కనుపాపగా నా లోన మెదులుతున్నావని
ఏరులై, సెలఏరులై గల గల పారుతున్నవని
ధారలై, రుధిరథారలై నాలోన పారుతున్నావని ||
నిను నేనందుకుందామని పరుగిడుతున్నాను
గాలివై, చిరుగాలివై నను తాకుతున్నవని
వాయువై, ప్రాణవాయువై నాలోను కదలుతున్నావని
వెలుపల, నాలోపల నీవంతట నిండి ఉన్నావని ||
నిను తెలుసుకుందామని నే తపిస్తున్నాను
బింబమై, అర్కబింబమై వెలుగునిస్తున్నావని
అగ్నివై, నా కుండలినీశాక్తివై నాలోన రగులుతున్నావని
తెలిపావు , నను వీడి నీవు వేరే లేవని నాలోని "నేనే" నీవని ||
Source:
మాతృశ్రీ మాస పత్రిక - సంపుటి 24 - సంచిక 12 - మార్చి 1990