రంగు లేని నీటి బొట్టు----ముత్యమైనయట్టు
తొలి కదలిక తానైన తల్లి- తొలి మోముకు మంగళం
తల్లికి జయమంగళం నిత్యశుభమంగళం ll
అరుణుడే అరుణ మాయె జగతి కార్య ప్రగతి
పగడాల కాంతులీను తల్లి ---మలిమోముకు మంగళం
తల్లికి జయమంగళం నిత్యశుభమంగళం ll
ఉత్తమ ధాతువై స్థితికి హేతువైన
పుత్తడి కాంతుల మోముకు జయమంగళం
తొలి సంధ్య మలి సంధ్య తోయగము నీలిమతో
లోవెలుగుల తల్లికి వేవెల్గుల తల్లికి జయమంగళం
తల్లికి జయమంగళం నిత్యశుభమంగళం ll
శుభ్రమై స్వచ్ఛమై కామలను చిదిమి అదిమి
కామకోటియై ధవళయై వెల్గు తల్లికి మంగళం
తల్లికి జయమంగళం నిత్యశుభమంగళం ll
పంచ భూతాత్మకయై పంచతన్మాత్రయై
పంచ బ్రహ్మాసనస్థితయైన ప్రజ్ఞకు
పాడేటివారిని పాలించు తల్లికి మంగళం
తల్లికి జయమంగళం నిత్యశుభమంగళం l