శ్రీరాముల వేంకటేశ్వర్లుగారు కాకుమానులో కాపురం ఉండేవారు. ఊరు ఊరు తిరిగి హరిలో రంగహరి అంటూ సంక్రాంతి రోజులలో పుష్యమాసమంతా హరికీర్తనా వర్తనులై జీవితాన్ని భగవచ్చింతనలో కాలం గడిపేవారు. ఆయన ధర్మపత్ని 'కృష్ణవేణమ్మ' గారు అనుకూలవతియైన సాధుశీల. దాసుగారు మొదట్లో జిల్లెళ్ళమూడికి ఆరకంగా వచ్చి వెళ్ళేవారు. కాని రాను రాను అమ్మను గూర్చి ఆ నోటా విని వచ్చి వెళుతూండేవారు. కృష్ణవేణమ్మ అక్కయ్య అమ్మకు బాగా సన్నిహితం కావడంతో తరచుగా వచ్చి ఒక్కొక్కసారి 'అమ్మ వద్దనే ఉంటాను కాకుమాను వెళ్లనని మారాం చేసేది. అమ్మ 'ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉండండి అంతేకాని ఒక్కళ్ళుండటం కాదన్నది'.
అంతలో చీరాల నుండి వచ్చే సోదరులు అమ్మ సేవకై ఒకళ్ళను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటుండగా, నాన్నగారు కూడా అమ్మ ఆరోగ్యం సరిగా లేనందున ఎవరైనా ఒకరు సహాయంగా ఉంటే మంచిదేనని ఆలోచించారు. ఆ సందర్భంగా నాడు తరచు వచ్చి వెళ్తూ అమ్మకు అన్ని పనులలో సాయం చేస్తున్న కృష్ణవేణమ్మగారు దృష్టి పధంలోకి రావడంతో ఆ కుటుంబాన్ని జిల్లెళ్ళమూడికి ఆహ్వానించడం వారు సంతోషంతో అంగీకరించి 1958 లో రావడం జరిగింది.
అమ్మకు అన్ని పనులలో సహాయపడుతూ కృష్ణవేణమ్మక్కయ్య ఉండగా,దాసుగారిని వచ్చిన సంవత్సరమే సంక్రాంతి దినాలలో అమ్మ మొదటి భిక్ష వేసి పంపింది పల్లెలకు. ఆది మాత వేసిన భిక్ష అక్షయ పాత్ర అయింది ఆయన పాలిటికి. ఆదిభిక్షువుకు కూడా భిక్ష వేసిన అన్నపూర్ణాదేవి చేయి కదా అది. ఆ సంవత్సరం ఏ యేడు లేని విధంగా పది బస్తాల బియ్యం పోగయినవి. ఆ ధాన్యాన్ని అమ్మకు సమర్పించారు. అమ్మ ఆలయాలు కడుతున్న పనివారికి, ఆ రోజులలో జిల్లెళ్ళమూడి వచ్చే సోదరీసొదరులకు వినియోగించింది. తదాది జిల్లెళ్ళమూడి వచ్చేవారికి సౌకర్యాలు చూస్తూ అన్నపూర్ణాలయ నిర్వహణ చేస్తూ కాలం వెళ్ళబుచ్చేవారు దాసుగారు.
వస్తుతః దాసుగారికి ఆయుర్వేదవైద్యంగా కొద్ది తెలుసు. తనకు తన మందే వాడుకుంటూ ఇతరులకు కూడా వైద్యం చేస్తుండేవారు. హరిదాసుగారు ఒక కుక్కను పెంచేవారు. అది వారి మంచం ప్రక్కనే పడుకునేది. జిల్లెళ్ళమూడి వచ్చి వెళ్ళే వారిని యేడవ మైలు వరకూ తోడుగా వచ్చి దించి వెళ్ళేది. అమ్మ హరిదాసుగారి కుక్కను 'దమయంతి' అనే పేరుతో పిలిచేవారు. దమయంతి 'ఒక పాటపాడవే' అని అమ్మ అంటే పాట పాడేది. అది తీసేరాగం అలా ఉండేది. ఒక అన్నయ్య 'ఇంకొక పాట పాడించవమ్మా!' అని అడిగితే అమ్మ "ఇంకొక పాట పాడవే" అనగానే మరోపాట పాడింది. ఈ సంఘటన విచారిస్తుంటే విశ్వాసం గల కుక్కతో పాటు హరిదాసుగారు కూడా అమ్మను విశ్వాసంతో సేవించారు అని అర్ధమవుతుంది. 'దమము' అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్ధం. ఇంద్రియాలను నిగ్రహించింది దమయంతి. దాసుగారు
ంద్రియనిగ్రహులో కాదో తెలియదు. కాని అన్ని ఇంద్రియాలతో అమ్మను సేవించుకున్నారు. దమము అంటే క్లేశము నోర్చుతనము అని కూడా అర్ధం.కష్టసహిష్ణుత అక్కడ పనిచేసేవారికి అమ్మనుండి సంక్రమించిన వరం. అది దాసుగారికి ఉన్నది.
హరిదాసుగారికి, కృష్ణవేణమ్మ గారికి చాల నియమాలుండేవి. జపం చెయ్యటం ధ్యానంలో కూర్చోవటమూ, తమకు కలిగిన అనుభవాలను పుస్తకాలలో వ్రాసుకోవటం ఉండేదిట. ఎందరినో దర్శించారు. ఎక్కడెక్కడికో తిరిగారు. ఎక్కడా తృప్తి కలగలేదు. అమ్మ ఒకసారి కొమ్మూరులో గంగరాజు లోకనాధరావుగారింటికి వెళ్ళినప్పుడు లోకనాధరావుగారి మీద గౌరవం కొద్దీ వారు పిలువగా అక్కడకు వచ్చారు. అక్కడ అమ్మను చూచి దాసుగారు కృష్ణవేణమ్మతో "ఓసి నీ దుంపతెగా నువ్వు కలలో చూచిన అమ్మ ఈ అమ్మే" అన్నాడట.
జిల్లెళ్ళమూడి రాకముందు కృష్ణవేణమ్మగారికి కలలో ఒక పల్లెటూరు, ఆ ఊరిడొంక, ఆ ఊళ్ళో రాళ్ళమెట్లున్న మంచినీళ్ళ చెరువు, అందులో కలువలు, పద్మాలు, ఒక పూరి గుడిసె, అందులో నుదుటన పెద్ద కుంకుమబొట్టుతో,దివ్యతేజస్సుతో ఒక ముతైదువ కనిపించాయి. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఆ విషయమై చర్చించుకున్నారు. ఈ అమ్మే ఆ పోలికలలో ఆ విధంగా కనిపించిందని వారు గుర్తించారు.
హరిదాసుగారు కృష్ణవేణమ్మతో కలసి జిల్లెళ్ళమూడి మొదటిసారి అమ్మ వద్దకు వెళ్ళినప్పుడు అమ్మ ప్రేమతో అన్నం కలిపి దాసుగారి నోట్లో ముద్దలు పెట్టింది. ఆ అనురాగానికి వాత్సల్యానికి ముగ్ధుడైన దాసుగారు ఆనందంతో పెద్దగా అన్నపూర్ణాష్టకం చదివి పరవశుడై కళ్ళవెంట ఆనందాశ్రువులు కార్చాడు. అనుభవించితే తెలిసేది కాని మాటలకు అందని ఆనందమది.
కృష్ణవేణమ్మ మొదటిసారి జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడు అమ్మ 'నీవు ఇదివరకు ఈ ఊరు వచ్చావా ? నన్ను చూచావ ? అని అడిగింది. 'లేదమ్మా! ఇదే మొదటిసారి రావటం' అని చెప్పింది. కృష్ణవేణమ్మ ఇంటికి వెళ్ళి హరిదాసుగారికి ఈ విషయం చెప్పగా 'నీవు కలలో జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను చూచావు గదా!' అన్నారు. కృష్ణవేణమ్మగారు 'నిజమే మరచిపోయాను' అన్నది.
ఒకసారి హరిదాసుగారు ఒక్కరే అమ్మను చూడటానికి జిల్లెళ్ళమూడి వెళ్ళగా, అమ్మ 'ఇప్పుడు నేను వెళ్ళితే కృష్ణవేణమ్మ నన్ను గుర్తుపడుతుందా?' అని అడిగింది. ఆ టైమును గుర్తుపెట్టుకొని దాసుగారు ఇంటికి వెళ్ళిన తర్వాత 'ఆ సమయంలో ఏం చేస్తున్నావు?' అని అడిగారు. ఆమె అప్పుడు 'మంచం మీద పడుకొని ఉన్నాను. ఎవరో తలుపుకొట్టిన చప్పుడైంది. ఎవరోలే అని వెళ్ళలేదు. మళ్లీ పెద్దగా తలుపుకొట్టిన చప్పుడైంది. బద్ధకంతో వెళ్ళి తలుపుతీశాను. కాని ఎవరూ కనిపించలేదు' అని చెప్పింది.
దాసుగారు మరొకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు కాకుమానులో వాళ్ళింటికి ఒక బాలుడు అన్నం అడుక్కుంటూ వచ్చాడు. కృష్ణవేణమ్మగారు అన్నం పెట్టింది. అయితే ఆ అబ్బాయి తనతో కలసి కృష్ణవేణమ్మను కూడా తినమన్నాడు. ఆమె అన్నం పెట్టి చేతులు కడుక్కొని వచ్చే లోపల అడుక్కునే అబ్బాయి అవతలి ఇంటి వద్దకు పోయి కనిపించలేదు. అతని కోసం అన్ని బజార్లు వెతికింది. కనిపించలేదు. తరువాత అమ్మ వద్ద ఈ ప్రస్తావన వస్తే అమ్మ 'మూగవాడేనా ?' అని అడిగింది. అమ్మే ఆ రూపంలో వచ్చిందని అప్పుడు గాని వారికి అర్ధం కాలేదు. ఆ రకంగా అమ్మపై విశ్వాసం నమ్మకం మొదలైంది జిల్లెళ్ళమూడి రాకముందు.
హరిదాసుగారు అమ్మ రవికలు కుడుతుండేవారు. వచ్చిన మొదటి రోజులలో చాలాకాలం వారే కుట్టేవారు. తన రవిక కుట్టటానికి హరిదాసుగారికి ఆదికి రెవిక యిస్తూ అమ్మ "ఇవ్వాళ రవిక బిగుతయింది. నిన్న వదులుగా వున్నది. మరి ఎట్లాకుడతావో ! ఏమో ? నా రవిక కుట్టడంలో నీ నేర్పంతా బయటపడుతుంది" అన్నారు ఒకసారి. అందుకు దాసుగారు నీ ఆది' తెలియదు అన్నారు. అందుకు అమ్మ 'నాది అనాది కనుక నా ఆది అందదు' అన్నారు. ఈ రకంగా అనాది అయిన ఆదెమ్మతో ఆడుతూ పాడుతూ సేవ చేస్తూ ఆ అందరింట్లో విశ్వజనని సేవలో తరించిన మహనీయుడాయన.
అమ్మను కృష్ణపరమాత్మగా దర్శించిన దార్శనికుడు దాసుగారు. ప్రేమతో చూచేవాడు అందరినీ. ఎవరైనా అన్నం తినకుండా ఉంటే సహించేవాడు కాదు. అన్నపూర్ణాలయం నుండి అన్నం తెచ్చి వాళ్ళ గుడిసెలో పెట్టించేవాడు కృష్ణవేణమ్మ గారితో. 1958,1960 ప్రాంతంలో చాలామంది వాళ్ళింట్లోనే సంచులు పెట్టుకొనేవారు. ఆ దంపతులు అమ్మ వద్దకు వచ్చే వారిని తమ పిల్లలుగా భావించి సేవచేసేవారు.
చివరి రోజులలో దాసుగారు అనారోగ్యంతో బాధపడుతూ డాక్టరు వద్దకు వెళ్ళితే ఏ డాక్టరూ జబ్బు నిర్ధారించలేకపోయారు. ఎంతో కాలంగా శరీరంలో కాన్సర్ జబ్బు ఉన్నా బాధ లేకుండా చేసింది అమ్మ. ఆ కాన్సర్ లక్షణాలను అంత్యకాలంలో మాత్రమే గ్రహించారు.
దాసుగారు మాములుగా చాల పరిశుభ్రమైన దుస్తులు ధరించి క్రొత్త పెళ్ళికొడుకులా కన్పించేవాడు ఎప్పుడూ. చివరి రోజులలో రాచర్ల లక్ష్మీనారాయణ 'నీకింకా జీవించాలని ఉందా?' అని అడిగాడు. అందుకు దాసుగారు 'ఆ కోరిక లేదు కాని శరీరం ఉన్నంత వరకు పరిశుభ్రంగా ఆచ్ఛాదన ఉండాలికదా!' అన్నాడు. అవును అమ్మ వద్ద తృప్తితో జీవించిన సేవించిన ధన్యజీవి. తృప్తే ముక్తి అన్నది అమ్మ. ఆ తృప్తిని అమ్మ దాసుగారికి ప్రసాదించింది. ధన్యుడు